చర్చలు తాత్కాలికంగా వాయిదా

4

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌,జనవరి14(జనంసాక్షి): భారత్‌-పాకిస్థాన్‌ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. పఠాన్‌కోట్‌ దాడి కేసులో జైషే మహమ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌ను అరెస్టు చేసినట్టు వచ్చిన వార్తలను పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో చర్చలను రీషెడ్యూల్‌ చేయనున్నట్టు పాక్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతకన్నా ముందే మొదట భారత్‌తో జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) స్థాయి చర్చలు చేపట్టనున్నామని, ఆ తర్వాత విదేశాంగ కార్యదర్శుల చర్చలు ఉంటాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారత ప్రభుత్వ వర్గాలు కూడా ఇదే వైఖరిని వెల్లడించాయి. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడికి సంబంధించిన తమ దర్యాప్తు వివరాలు ఇంకా భారత్‌తో పంచుకోలేదని, ఆ వివరాలు పరస్పరం పంచుకునేందుకు వీలుగా మొదట ఎన్‌ఎస్‌ఏ చర్చలు నిర్వహించనున్నట్టు పాక్‌ వర్గాలు తెలిపాయి. దర్యాప్తును మరింత ముందుకు కొనసాగించేందుకు తమకు మరింత సమాచారం కావాలని, తమ విచారణ బృందం భారత్‌ సందర్శించాలనుకుంటున్నదని పాక్‌ వర్గాలు తెలిపాయి. మసూద్‌ అజార్‌ అరెస్టు వార్తలపై పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖలిలుల్లా ఖాజి గురువారం స్పందిస్తూ ‘ఆ వార్తల గురించి నాకు తెలియదు. చర్చలు మరో తేదీన నిర్వహించడంపై ప్రస్తుతం ఉమ్మడిగా చర్చలు జరుగుతున్నాయి. అందరికీ ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు అని మేం చెప్తూనే ఉన్నాం. దీనిని అంతమొందించేందుకు మనం కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది’ అని అన్నారు.