చలానాలతో వాహనదారులకు వేధింపులు

పార్కింగ్‌ సమస్యలకు తోడు చలాన్ల బెడద

హైదరాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో రోడ్ల సమస్యలకు తోడు పార్కింగ్‌ సమస్య తీవ్రంగా మారింది. రోడ్డు పక్కన వాహనాలను పోలీసుల లాగేసుకుని పోతున్నారు. అలాగే ఎక్కడ పెట్టినా చలాన్లు రాస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. నగరంలో గుంతల రోడ్లకు తోడు పార్కింగ్‌ సమస్యలు, చలాన్ల భారాలు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఇంటికి చలానా వచ్చే వరకు తెలియడం లేదని వాపోతున్నారు. ఇకపోతే రాజధానిలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతుందని పోలీసు శాఖ నివేదిక ఇప్పటికే తేల్చింది. ఆయా ప్రాంతాల్లో ఈ సమస్య వల్ల ఉన్న ఇబ్బందులను అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా పార్కింగ్‌ సమస్య కారణంగా ట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడుతున్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో

పార్కింగ్‌ కోసం ఒక విధానం అవసరమని జీహెచ్‌ఎంసీ భావించింది. పోలీసు, హెచ్‌ఎండీఏ, మెట్రో తదితర అధికారులతో చర్చించి కొత్త విధానానికి రూపకల్పన చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. పార్కింగ్‌ కాంప్లెక్సులు వినియోగంలోకి వస్తే రోడ్ల పక్కన పార్కింగ్‌ను పూర్తిగా నిషేధిస్తారు. ఆబిడ్స్‌, నాంపల్లి, కూకట్‌పల్లి తదితర అనేక చోట్ల సముదాయాలను ఏర్పాటు చేసి వాటిని మెట్రో స్టేషన్లకు అనుసంధానం చేస్తారు. నగరంలో అనేక కీలకమైన

ప్రాంతాల్లో ప్రైవేటు రంగంలో పార్కింగ్‌ కాంప్లెక్సులను నిర్మించేందుకు స్థిరాస్తి వ్యాపారులకు గానీ ఇతర భవన నిర్మాణ యజమానులకు గానీ వివిధ రాయితీలను ఇవ్వనున్నారు. పార్కింగ్‌ వ్యవస్థను పర్యవేక్షించడానికి ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తారు.ఎవరైనా తమ సొంత స్థలంలో పార్కింగ్‌ కాంప్లెక్సును నిర్మించి జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తే పార్కింగ్‌పై వచ్చే మొత్తం సొమ్ములో సగం అతనికే ఇస్తారు.ఇకపోతే జీహెచ్‌ఎంసీ కీలకమైన 14 ప్రాంతాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్‌ కేంద్రాలను నిర్మించనుంది. దీంతో ఆయా ప్రాంతాలను గుర్తించి బహుళ అంతస్తుల పార్కింగ్‌ భవనాలను నిర్మిస్తారని గ్రేటర్‌ మున్సిపల్‌ అధికార వర్గాలు తెలిపాయి. పార్కింగ్‌ కాంప్లెక్సులు వచ్చాక.. ప్రధాన మార్గాల్లో ఎక్కడా

రోడ్డు పక్కన వాహనాల పార్కింగ్‌ ఉండదు కాబట్టి వాహనాలు సాఫీగా ముందుకు వెళ్లిపోతాయని పోలీసులు చెబుతున్నారు. కొత్త విధానంలో పెద్దసంఖ్యలో కాంప్లెక్సుల నిర్మాణానికి చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. పాతబస్తీలో ఖాళీ స్థలాలున్న చోట ఇప్పటికే నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు.నూతన విధానం అమల్లోకి వస్తే నగరంలోని పలు ప్రాంతాల్లో ఒకవైపు బల్దియా మరోవైపు ప్రైవేటు రంగంలో చిన్నవి పెద్దవి వందల సంఖ్యలో పార్కింగ్‌ సముదాయాలు అందుబాటులోకి వస్తాయి.