చలిమంటలు అంటుకుని గుడిసె దగ్ధం
ప్రమాదంలో వృద్ద దంపతుల మృతి
చిత్తూరు,ఫిబ్రవరి8(జనం సాక్షి): శ్రీకాళహస్తి లంకమిట్టలో విషాదం చోటుచేసుకున్నది. చలి బారి నుంచి తట్టుకునేందుకు వేసుకున్న చలి మంట ఆ వృద్ధ దంపతుల పాలిట శాపంలా మారింది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో వారు నిద్రిస్తున్న పూరిగుడిసెకు మంటలు అంటుకున దంపతులు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. శ్రీకాళహస్తి లంక మిట్టకు చెందిన వెంకట ముని (85), లక్ష్మమ్మ(75) దంపతులు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సోమవారం చలిగా ఉండటంతో చలిమంట వేసుకుని పడుకున్నారు. అయితే, అర్ధరాత్రి చలిమంటలు ఒక్కసారిగా గుడిసెకు అంటుకున్నాయి. మంటలు గుడిసెకు చుట్టుముట్టడంతో వెంటనే బయటకు రాలేకపోయారు. దాంతో వారు ఇద్దరూ మంటల్లో సజీవదహనమయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు ధృవీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులిద్దరూ సజీవ దహనం కావడం పట్ల లంక మిట్టలో విషాదఛాయలు అలుముకున్నాయి.