చల్లారని ఢిల్లీ

ఎగసిిపడుతున్న యువతరంగాలు
బాధితురాలి పరిస్థితి విషమం
జనవరి 2 నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో రోజూవారి విచారణ
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) :
మెడికోపై గ్యాంగ్‌రేప్‌ను నిరసిస్తూ యువతరంగం ఎగసి పడుతోంది. ఢిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద సోమవారం నాలుగో రోజూ ఆందోళన కార్యక్రమాలు మిన్నంటాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినా యువతరం వెనక్కు తగ్గలేదు. తెల్లవారకముందే ఎముకలు కొరికే చలిలో యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళ నకు దిగారు. భద్రత బలగాలు వారిని చెదర గొట్టి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నాయి. నిందితులను ఉరితీయాలని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ¬ంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే, సీఎం షీలాదీక్షిత్‌ భేటీ అయ్యారు. అత్యాచార ఘటనలపై విచారణకు 5 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2 నుంచి ఇలాంటి ఘటనలపై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో రోజువారీ విచారణ నిర్వహించనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇదిలావుంటే ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఆమె చేతనలోనే ఉందని, అయితే ముప్పు నుంచి బయటపడలేదని వారన్నారు. జ్వరంతో బాధప తోందని, ఇంకా వెంటిలేటర్‌పైనే ఉందని చెప్పారు. గత రాత్రి నుంచి ఆమె ఆరోగ్యంలో ఏ విధమైన ప్రగతి కనిపించలేదని చెప్పారు. రక్తస్రావం కూడా జరుగుతున్నట్లు- తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత ఆమె మెదడు పనిచేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గ్యాంగ్‌ రేప్‌నకు నిరసనగా సోమవారం కూడా ఢిల్లీ అట్టుడికింది. ఇండియా గేట్‌ వద్ద ఆందోళన కొనసాగుతూనే ఉంది. బాధితులను బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్‌ చేశారు. ప్లకార్డులను పట్టుకుని నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిరసన ప్రదర్శనల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయంకలిగింది. గ్యాంగ్‌ రేప్‌ కేసులో వారం రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇద్దరు అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్లను సస్పెండ్‌ చేశారు. నేరాన్ని ఎందుకు అపలేకపోయారంటూ ఇద్దరు డిసిపిలను వివరణ అడిగారు. మరోవైపు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని బిజెపి బృందం కలవనుంది. ఘటనపై పూర్తి వివరాలను రాషట్‌రపతికి అందజేస్తామని సుష్మాస్వరాజ్‌ తెలిపారు. అమెరికా పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తేజీందర్‌ ఖన్నా ఢిల్లీకి చేరుకున్నారు. మహిళ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతోనూ, మహిళా సంఘాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. మోహన్‌ సింగ్‌ దబాస్‌ (ట్రాఫిక్‌), యాగ్రామ్‌ (పిసిఆర్‌) అనే ఇద్దరు ఎసిపిలను సస్పెండ్‌ చేశామని, ఇద్దరు డిసిపిలను వివరణ అడిగామని ఖన్నా చెప్పారు. గ్యాంగ్‌ రేప్‌పై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తిన నేపథ్యంలో టెలికం మంత్రిత్వ శాఖ మూడంకెల హెల్ప్‌లైన్‌ ఏర్పాటు- చేసినట్లు- ప్రకటించింది. మహిళలు 167 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపింది. ప్రమాదంలో చిక్కుకున్న మహిళలను ఆదుకోవడానికి మూడంకెల హెల్ప్‌లైన్‌ను కేటాయించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ టెలికం మంత్రి కపిల్‌ సిబాల్‌ను కోరారు.