చాయ్‌వాలావి 15లక్షల సూట్‌ వేసుకుంటావా?

5

– పేదలు, రైతులకు దూరం

– ఎన్డీఏ కుంభకోణాలమయం

– బీహార్‌ ఎన్నికల సభలో ప్రధాని మోదీపై రాహుల్‌ ఫైర్‌

పాట్నా,సెప్టెంబర్‌19(జనంసాక్షి): కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సూటు-బూట్ల సర్కారు అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోమారు విమర్శించారు. గతంలో సూటుబూటు సర్కారంటూ విమర్శించిన రాహుల్‌ తాజాగా మరోమారు ఇదే విమర్శలను ఎక్కుపెట్టారు. బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లా రాంనగర్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ పాల్గొని మాట్లాడారు.’బట్టలు మనిషి వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తాయి. గాంధీజీ అందువల్లే జాతి పితగా గౌరవం పొందుతున్నారు. అయితే మోదీ మాత్రం ఎప్పుడూ సూటు ధరిస్తారు. అలాంటి దుస్తులు ధరించిన ప్రజలతోనే మాట్లాడతారు. చర్చలు జరుపుతారు. ఆయనకు రూ.15లక్షల విలువ చేసే సూట్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం ‘సూటు-బూట్ల’ ప్రభుత్వం అని అనాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.  వారికి పేదలు అక్కర్లేదు. ఇది సంపన్నులకు మాత్రమే ప్రభుత్వం’ అంటూ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ నేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు సైతం పాల్గొన్నారు. త్వరలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంపారన్‌లో రాంనగర్‌లో ఉన్న హజారీ మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వితో కలిసి పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్‌ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ చాయ్‌వాలా అని ప్రజలు చెప్పుకుంటున్నారు. కానీ, చాయ్‌వాలాగా చెప్పుకునే మోదీ సూట్‌ బూట్‌ వేసుకునే వాళ్లకే దగ్గరవుతున్నారని విమర్శించారు. మోదీ సూట్‌బూట్‌కే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. మోదీ, ఆయన సూట్‌బూట్‌ వాలా దోస్తుల నుంచి బీహార్‌ను రక్షిస్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. చంపారన్‌ చక్కెర పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని మోదీ చెప్పారు కానీ ఇప్పటి వరకు పరిశ్రమను తెరిపించిన పాపాన పోలేదని మండిపడ్డారు.