చారిత్రకకట్టడాలను పరిరక్షించుకుంటాం
` బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం
` భక్త రామదాసు జన్మస్థలం, పాలేరు రిజర్వాయర్
` మూడిరటినీ పర్యాటక కేంద్రాలుగా మారుస్తాం
` డీపీఆర్ సిద్దం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
` నేలకొండపల్లిలో మంత్రులు పొంగులేటి, జూపల్లితో కలిసి పర్యటన
ఖమ్మం(జనంసాక్షి): నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం ఒకటో శతాబ్దం నాటిదని, 8 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్థూపం దక్షిణ భారత దేశంలోనే పెద్దదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ రఘురామిరెడ్డితో కలిసి బౌద్ధస్థూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ బుద్ధిస్ట్ మ్యూజియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. అండర్ గ్రౌండ్లో ఆనాటికి సంబంధించిన శిలలు ఉన్నాయన్నారు. బౌద్ధ స్థూపాన్ని ఇండియాలనే ది బెస్ట్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. అభివృద్ధి కి కావలసిన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఇందుకోసం డీపీఆర్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. నేలకొండ పల్లికి మరో ప్రత్యేకత ఉందని, భక్తరామదాసు జన్మస్థలమని దానిని మరింత అభివృద్ది చేస్తామని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పాలేరు రిజర్వాయర్ కూడా ప్రత్యేకత అని ఈ మూడిరటిని అభివృద్ది చేయడం ద్వారా పర్యాటకులను విశేషంగా ఆకర్షించవచ్చన్నారు. తమ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పర్యటకులను నేలకొండపల్లి ఆకర్షిస్తోందని, ఇంకా ఎక్కువ మంది ఈ కేంద్రాలను సందర్శించేలా వసతులు మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.