చిక్కుపల్లి కాజ్‌వేపై తగ్గిన వరద
ఖమ్మం, జూలై 28 : గోదావరి వరదల కారణంగా నీట మునిగిన వాజేడు మండలంలోని చిక్కుపల్లి కాజ్‌వేపై శనివారం నాడు వరద నీరు తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు పునరుద్దరించబడ్డాయి. వాజేడు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తోడుగా, గోదావరి వరద కూడా రావడంతో గత మంగళవారం చిక్కుపల్లి కాజ్‌వే నీట మునిగింది. దీనితో నాలుగు గ్రామ పంచాయితీలోని 27 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాటు పడవల ద్వారా వాగులు దాటి నానా అవస్థలు పడ్డారు. శనివారం నాడు వరద నీరు తగ్గటంతో రాకపోకలు కొనసాగుతున్నాయి. విద్య, వైద్య సౌకర్యానికి దూరంగా ఉన్న 25 గ్రామాల ప్రజలు వరద తగ్గటంతో ఊపిరి పీల్చుకున్నారు.