చిక్కుల్లో కోహ్లీ: వెనక్కి తగ్గని జర్నలిస్టు, ఐసిసీ బీసిసీఐలకు ఫిర్యాదు
పెర్త్: ఓ జర్నలిస్టును దుర్భాషలాడినందుకు భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నాడు. జట్టు యాజమాన్యం సర్దిచెప్పినప్పటికీ ఆ జర్నలిస్టు మాట వినడానికి నిరాకరించాడు. అతను విరాట్ కోహ్లీపై ఐసిసికి, బిసిసిఐకి ఫిర్యాదు చేశాడు. అవగాహనా లోపం వల్ల ఆ సంఘటన చోటు చేసుకుందని, ఆ సమస్యకు అంతం పలకాల్సి ఉందని, జట్టు ప్రపంచ కప్‌పై దృష్టి కేంద్రీకరించే విధంగా చేయడం అవసరమని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. విరాట్ కోహ్లీ ఆ సంఘటనపై వివరణ ఇచ్చాడని, భారత్‌కు ప్రస్తుత ప్రపంచ కప్ అత్యంత ముఖ్యమైందని, మిగతా సమస్యలన్నింటినీ పక్కన పెట్టాల్సి ఉంటుందని, పరిస్థితిని సరిగా అవగాహన చేసుకోలేదని పరోక్షంగా చెప్పాడని, ఈ వివాదానికి అంతం పలకాలని ఠాకూర్ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. తాను ఆటగాళ్లతో మాట్లాడలేదని, జట్టు యాజమాన్యం అక్కడే ఉందని, అంతా చూసకుంటుందని ఆయన అన్నారు. చిక్కుల్లో కోహ్లీ: వెనక్కి తగ్గని జర్నలిస్టు, ఐసిసీ బీసిసీఐ అవగాహనాలోపం వల్లనే ఆ సంఘటన చోటు చేసుకుందని, అసభ్యకరమైన పదజాలం వాడలేదని, విరాట్ ఆ వ్యక్తితో మాట్లాడాడని, దాంతో వివాదం ముగిసినట్లేనని జట్టు యాజమ్యానం ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. తమ జర్నలిస్టును తిట్టిన విరాట్ కోహ్లీపై హిందూస్తాన్ టైమ్స్ బిసిసిఐకి, ఐసిసికి ఫిర్యాదు చేసింది. ఎడిటర్ – ఇన్- చీఫ్‌ను సంప్రదించి బిసిసిఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియాకు తాను లేఖ రాశానని, ఈ సంఘటనను పరిశీలించాలని తాను దాల్మియాను అడిగానని, రిపోర్టర్ జస్వీందర్ సిద్ధు కూడా సంఘటన గురించి ఐసిసికి తెలియజేశాడని హిందూస్తాన్ స్పోర్ట్స్ ఎడిటర్ సుఖ్వంత్ సింగ్ చెప్పారు. ఆ దేశంలోని చట్టాలను ఏమైనా విరాట్ కోహ్లీ ఉల్లంఘించాడా, అతనిపై ఏమైనా చర్యలు తీసుకోవడానికి వీలుంటుందా అనే కోణంలో హిందూస్తాన్ టైమ్స్ పరిశీలన చేస్తోంది.