చిచ్చు పెడుతోన్న టిక్‌టాక్‌ వీడియాలు

మంచి కన్నా చెడు ఎక్కువంటున్న మేధావులు
నిషేధం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి
హైదరాబాద్‌,జూలై30 (జనం సాక్షి): టిక్‌టాక్‌ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగోతంది. దీనివల్ల మంచికన్నాచెడు ఎక్కువగా జరుగతోంది. ఇటీవల అనేకచోట్ల ఈ వ్యామోహంలో అనేకులు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. తమిళనాడులోని మధురైకు చెందిన ముత్తుకుమార్‌ అనే న్యాయవాది
టిక్‌టాక్‌లో అశ్లీలత పెరగుతోందని, ఆత్మహత్యలకు ఉసిగొల్పుతోందంటూ మద్రాస్‌ హైకోర్టులో పిల్‌దాఖాలు చేశారు. దీంతో టిక్‌టాక్‌ను నిషేధించాలని కేంద్రానికి కోర్టు సూచించింది. అయితే టిక్‌ టాక్‌తో దుష్పపరిణామాలే కాకుండా కొన్ని కుటుంబాలు సైతం బాగుపడ్డాయన్న వాదనలు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన భార్యభర్తలు హరిష్‌, జయప్రదల మధ్య తగాదాలతో మూడేళ్ల క్రితం భర్త ఎటోవెళ్లిపోయాడు. టిక్‌టాక్‌లో భర్త వీడియోలు చూసిన పలువురు భార్యకు చెప్పగా పోలీసుల సహకారంతో దంపతులు ఒక్కటయ్యారు. చదువుకునే యువత.. గృహిణులు.. ఉద్యోగులు.. సెలబ్రెటీలు పగలు..రాత్రి తేడాలేకుండా గంటకోసారి టిక్‌టాక్‌ యాప్‌లో కాలక్షేపం చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. కాలక్షేపానికి టిక్‌టాక్‌ వీడియోలు చేసినా.. చూసినా… బాధ్యతులు మరువద్దని పలువురు సూచిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో ఉద్యోగులు విధులు మరిచి టిక్‌టాక్‌లు చేస్తున్నారు. వీడియోలు వైరల్‌ కావడంతో ఉద్యోగాలు సైతం కోల్పోతున్నారు. అయితే ఈ మోజులో  మాయా ప్రపంచానికి బానిసలు కావొద్దని పలువురు సూచిస్తున్నారు.  టిక్‌టాక్‌ వినోదం వ్యసనంగా మారొద్దు. ఏదో చేయాలి, దాన్ని అందరూ చూడాలనే లక్ష్యంతో చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుని అసుపత్రుల పాలవుతున్నారు. టిక్‌టాక్‌తో రోజుకు రెండు, మూడు గంటల విలువైన సమయాన్ని  వృథా చేస్తున్నారు. ఇకపోతే చదువుకుంటున్న యువత టిక్‌టాక్‌కు దూరంగా ఉండటమే మంచిది. విలువైన కాలాన్ని టిక్‌టాక్‌ల పేరిట ఖర్చు చేస్తే, చివరకు జీవితంలో విలువనే లేకుండా మిగిలిపోతారు. నేటి ఆండ్రాయిడ్‌ యుగంలో 70శాతానికి పైగా ఫోన్లలో టిక్‌టాక్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఏదోఒక సినిమా పాటకు, సన్నివేశానికి వీడియో చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నారు. ఎక్కువ లైక్‌లు వస్తే.. టిక్‌టాక్‌కు బానిసలవుతున్నారు. కొందరైతే లైక్‌ల కోసం లైఫ్‌నే రిస్క్‌ చేస్తున్నారు. టిక్‌టాక్‌ కారణంతో ఎన్నో సంసారాలు విచ్ఛిన్నమయ్యాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్లారు. తాజాగా ప్రజాసేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్‌ ప్రపంచంలో మునిగి తేలడం వైరల్‌ అవుతోంది.రాష్ట్రంలో వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
చైనాకు చెందిన ఓ కంపెని టిక్‌టాక్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ల్లో టిక్‌టాక్‌ నాగులోది. తెలుగు రాష్ట్రాల్లో  3కోట్ల మంది టిక్‌టాక్‌ వినియోగిస్తున్నారు. టిక్‌టాక్‌ ద్వారా మనల్ని మనం సరికొత్తగా పరిచయం చేసుకోవచ్చు. సినిమాలోని ఓ పాటకు హీరో, హీరోయిన్లుగా మనమే డ్యాన్స్‌ చేయవచ్చు. సినిమాలోని డైలాగులకు తగ్గట్టుగా నటించొచ్చు. ఇలాంటి సన్నివేశాలను అండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా రికార్డు చేసి, సెల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న టిక్‌టాక్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. దీంతో చూసినవారు లైక్‌లు, సందేశాలు, షేర్‌చేయడం చేస్తుంటారు. దీంతో ఆ వీడియో తీసినవారు సంతోషంతో మరిన్ని కామెంట్లు, లైక్‌లకోసం వరుసవీడియోలు తీయడం పరిపాటిగా
మారింది. కొందరైతే నటీ,నటులకు తామేవిూ తక్కువకాదంటు మేకప్‌లతో సింగారాలు, కొత్త బట్టలు వేసుకుని తమనుతాము ప్రజెంట్‌ చేసుకోవడానికి ప్రయత్నిసుంటారు. ఇంకొందరు రాజకీయనాయకుల వాయిస్‌తో, వారి సన్నివేశాలను చిత్రీకరించి రెండు కలిపి టిక్‌ టాక్‌లో పెడుతున్నారు. చివరకు భర్తతో కలిసి భార్య, భార్యతో కలిసి భర్త, అమ్మా,నాన్న.. పిల్లలు… బంధువులతో టిక్‌టాక్‌లు చేస్తున్నారు.ఈ మోజులో అనేకానేక ఘటనలు చోటు చేసుకుంటున్న తరుణంలో నిసేధం విధించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.