చిత్తూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

– ఆగివున్న లారీని ఢీకొన్న కారు
– ఆరుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
– మృతులంతా గుంటూరు జిల్లా రుద్రవరం వాసులు
చిత్తూరు, జూన్‌7(జ‌నంసాక్షి) : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని తిరుపతి వైపు వెళ్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడకక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రేణిగుంట మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై గురవరాజుపల్లి వద్ద శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరానికి చెందిన విజయ భారతి(38), ప్రసన్న(14), చెన్నకేశవరెడ్డి(12), డ్రైవర్‌ ప్రేమ్‌రాజు (35), అంకయ్య(40), ప్రసన్న(14)లు మృతిచెందారు. వీరిలో ఐదుగురు ప్రమాద స్థలంలో మృతిచెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు అచ్చంపేట నుంచి తిరుపతికి వస్తుండగా గురవరాజుపల్లి వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రేణిగుంట పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతుల కుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి..
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ సవిూపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు కాజ సవిూపంలో రహదారి డివైడర్‌ను ఢీకొట్టి గుంటూరు నుంచి విజయవాడవైపు వెళ్తున్న మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులోని దంపతులతో పాటు మరో వ్యక్తి మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన జాతీయ రహదారి టోల్‌గేట్‌ సిబ్బంది క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని నిలిచినట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.