చిద్దూ‌కు మరో షాక్: శారదా స్కామ్‌లో భార్య నళిని

indexకోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరో షాక్ తగిలింది. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం పన్ను ఎగవేతలకు సంబంధించి ఆయన కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం విదితమే. తాజాగా చిదంబరం భార్య నళిని శారద చిట్ ఫండ్ చార్జ్‌షీట్‌లోకి ఎక్కింది. శారద కుంభకోణానికి సంబంధించిన ఆరో ఛార్జ్‌షీట్‌ను సోమవారం కోర్టులో దాఖలైంది. ప్రముఖ న్యాయవాది అయిన నళిని పేరును సీబీఐ ఛార్జీషీట్‌లో ప్రస్తావించింది. అయితే ఈ కేసుకు సంబంధించి శారద చిట్ ఫండ్ యజమాని సుదీప్త సేన్, మనోరంజగన్ గుప్తాల మధ్య జరిగిన ఒప్పందంలో నళిని కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆమెను సాక్షిగా గానీ, నిందితురాలిగా గానీ పేర్కొనలేదు. శారద కుంభకోణం కేసులో నిందితుడు మనోరంజన సింగ్‌కు నళిని న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారని, ఆమెకు చెల్లించిన ఫీజు విషయాన్ని చార్జిషీట్‌లో ప్రస్తావించారని, ఆ ఫీజును శారద చిట్‌పండ్స్‌కు చెందిన డబ్బుల నుంచి చెల్లించారని సిబిఐ అధికారులు అంటున్నారు. తన కార్పోరేట్ వ్యవహారాలను నళిని చూస్తున్నందున శారదా, జిఎన్ఎన్ ఇండియాకు మధ్య జరిగిన అవగాహనా పత్రాన్ని చెన్నైలో ఎన్‌సి అసోసియేట్స్ రూపొందించినట్లు మనోరంజన సిబిఐ విచారణలో చెప్పినట్లు సమాచారం.