చినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సాధిస్తా: ఎమ్మెల్యే
ఖమ్మం, జూలై 30 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలోని చినపాక నియోజకవర్గ పర్యటనకు వస్తున్న సందర్భంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులను కచ్చితంగా సాధిస్తానని చినపాక ఎమ్మెల్యే కాంతారావు అన్నారు. మారుమూల నియోజకవర్గమైన చినపాకకు ముఖ్యమంత్రి రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. సీఎం పర్యటన సందర్భంగా పులుసుబొంత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అలాగే వంద కోట్ల మంచినీటి పథకానికి నిధులు రాబడతానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కరకగూడెం బ్రిడ్జి ఆళ్లపల్లి, సింగిరెడ్డి పల్లి, పాములపల్లి ఎత్తిపోతల పథకాలు, గుండాల మంచినీటి పథకంతోపాటు అనేక అభివృద్ధి పథకాలకు సీఎం పర్యటనలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.