చిన్నతరహా పరిశ్రమలకు మోడీ దీపావళి కానుక

కోటి వరకు సులభంగా రుణం ఇచ్చేలా నిర్ణయాలు

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): చిన్నతరహా, మధ్యతరహా వ్యాపార సంస్థలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి కానుక ప్రకటించారు. ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి 12 పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు)కు సహకారిస్తూ, చేరువయ్యే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో దీపావళి సమయం బ్జడెట్‌ సమయంలాగానే చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.1 కోటి వరకు రుణాన్ని 59 నిమిషాల్లో ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి 12 నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇవన్నీ ఈ రంగానికి దీపావళి కానుక అని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రుణ పరపతిని పెంచేందుకు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ విధానాలు దోహదపడతాయన్నారు. ఎంఎస్‌ఎంఈల వల్ల మన దేశం ఆర్థిక శక్తి కేంద్రంగా మారిందన్నారు. ఈ రంగానికి చేరువయ్యే ఈ పథకం దేశంలోని 100 జిల్లాల్లో 100 రోజులపాటు అమలవుతుందని తెలిపారు. ఢిల్లీలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సపోర్టు, అవుట్‌ రీచ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిన్న, మధ్యతరహా ఉద్యోగులను, పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి పథంలో ముందున్నాయన్నారు. అన్ని రాష్టాల్రల్లో లఘు పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించామని మోదీ తెలిపారు.