చిన్నారుల మరణాలపై చలించిన ఒబామా

అమెరికాలో కాల్పుల ఘటనపై ఒబామా దిగ్భ్రాంతి
వాషింగ్టన్‌, డిసెంబర్‌ 15 : కనెక్టికట్‌ న్యూటౌన్‌లోని శాండీ హుక్‌ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దిగ్భ్రాంతికి గురయ్యారు. కాల్పుల ఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఘటనను ఖండిస్తూ శనివారం శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒబామా ఉద్వేగంగామాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. అమెరికా పతాకాన్ని అవనతం చేయవలసిం దింగా ఒబామా ఆదేశించారు. ఒకదేశంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదుర్కొన్నామని ఒబామా అన్నారు. అది కనెక్టికట్‌ ఎలిమెంటరీ స్కూల్‌ కావచ్చు, ఒరగాన్‌లోని షాపింగ్‌ మాల్‌ కావచ్చు మరో పాఠశాల కావచ్చు వారంతా మనవారే అని, మన పిల్లలే అని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు ఆపడానికి సహేతుకంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంభాలను అన్ని విధాలా ఆడుకుంటామని ఒబామా హామీ ఇచ్చారు. పాఠశాలలో 5 నుంచి 10ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలు మరణించిన సంఘటనను ప్రస్తావించినప్పుడు ఆయన విపరీతంగా కదిలిపోయినట్లు కనిపించారు.
ప్రసంగాన్ని ఏకధాటిగా కొనసాగించలేక పోయారు. మధ్య మధ్య ఆగుతూ, కళ్లు తుడుచుకుంటూ ప్రసంగం చేశారు. ఈ దుర్ఘటన గురించి విన్న వెంటనే తమ గుండెలు పగిలాయని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో కనెక్టికట్‌ ఎలిమెంటరీ పాఠశాలలో ఒక యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 27మంది మరణించిన విషయం తెలిసిందే. కనెక్టికట్‌ న్యూటౌన్‌లోని శాండీ హుక్‌ ఎలిమెంటరీ పాఠశాలలోకి శుక్రవారం ఉదయం సెమీ ఆటోమేటిక రైఫిల్‌తో ఓ దుండగుడు బడి ఆవరణలో అడుగుపెట్టాడు. తుపాకీతో విచ్చల విడిగా కాల్పులు జరిపాడు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా చెలరేగిపోయాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
స్కూలుకు రావడానికి ముందే ఇంట్లో ఆ దుండగుడు తన తల్లినే కాల్చి చంపాడు. కనెక్టికట్‌ పాఠశాలలో కాల్పులు జరిపిన యువకుడిని గుర్తించారు. అతను 24ఏళ్ల లాంజాగా గుర్తించారు.మరింత సమాచారం కోసం అతని తమ్ముడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన యువకుడి తల్లి నాన్సీ లాంజా పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ దుర్ఘటనపై పోలీసులు విచారణ జరుగుతోంది.