చిన్న రాష్ట్రం వచ్చింది.. చిన్న కులాలకు రాజ్యాధికారం దక్కలేదు
– గద్దర్
హైదరాబాద్,జనవరి26(జనంసాక్షి):దేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడితే.. చిన్న కులాలకు రాజ్యాధికారం వస్తుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారని, అయితే.. తెలంగాణ చిన్నరాష్ట్రం ఏర్పడినా చిన్నకులాలకు అధికారం మాత్రం దక్కలేదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. జనాభాలో కేవలం 0.4 శాతం ఉన్న కులం వారికి అధికారం వచ్చిందన్నారు. ప్రస్తుతం సిద్ధాంత పరమైన ఉద్యమాలకు జనం సిద్ధంగా లేరని చెప్పారు. అయితే.. ప్రజల్లో ఇప్పటికీ ఐక్యత, పోరాటపటిమ ఏమాత్రం తగ్గలేదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సంఘం నూతన డైరీ-2016 ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజాస్వామిక విస్తరణ కోసం పార్టీలకు అతీతంగా కార్యాచరణను కొనసాగించాలని ప్రజాసంఘాలకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారంపై వెనక్కు వెళ్లేది లేదని అన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చితే మున్సిపల్ విభాగంలో కిందిస్థాయి ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు. సమాజంలో మాదిరిగానే కార్యాలయాల్లోనూ వివక్షకు గురవుతున్నారని చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవస్థ కారణంగానే చిన్న ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఉద్యోగుల పరిరక్షణ అంటే.. కేవలం ఆర్ధిక లబ్ది మాత్రమే కాదని, అందరికీ సమాన గౌరవం లభించినపుడే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజాసంఘాల పాత్ర, కార్యాచరణ, సైద్ధాంతిక అంశాలపై స్పష్టత కొరవడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు తిప్పర్తి యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్‌మోహన్, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, ప్రెస్ అకాడవిూ చైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, టీఎన్‌జీవో నేతలు దేవీప్రసాదరావు, రవీందర్‌రెడ్డి, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ చైర్మన్ విమలక్క తదితరులు పాల్గొన్నారు.