చిరుతల సంచారం..ఆందోళనలో ప్రజలు
ఆదుకోవాలని ప్రజల వేడుకోలు
కామారెడ్డి,జూన్4(జనం సాక్షి ): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చిరుత పులులు సంచరిస్తున్న తీరుతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని అయిదు గ్రామాల శివారులోని అటవీ ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్లు ప్రజలు చెప్తున్నారు. భిక్కనూరు శివారులోని శ్రీ సిద్ధిరామేశ్వరాలయం సవిూపంలో గొర్రెలు, మేకల మందలపై చిరుతలు వరుసగా దాడులు చేసి వాటిని చంపి తింటున్నాయి. నెల రోజుల క్రితం నుంచి అయ్యప్ప ఆలయం వెనుక మేకలు నిత్యం చెరువు నీరు తాగే సమయంలో చిరుత పులులు కనిపిస్తున్నాయి. అలాగే ఆలయ సవిూపంలోని పలు ప్రాంతాల్లో దాహం తీర్చుకునేందుకు వస్తున్న సమయంలో చిరుత పులుల ఉనికి బయట పడుతోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాము ఎక్కడ వాటి బారిన పడతామో అని భయంతో ఉన్నారు. మండలంలోని భిక్కనూరు, అంతంపల్లి, ర్యాగట్లపల్లి, గుర్జకుంట, రామేశ్వర్‌పల్లి గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఓ తల్లి చిరుతతో పాటు మరో రెండు పిల్ల చిరుతలు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ చిరుతలు ఇప్పటికే 18 మేకలు, గొర్రెలను చంపి తినగా.. తాజాగా రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో పొలం దగ్గర కట్టేసి ఉంచిన చేపూరి రమేశ్‌కు చెందిన దూడపై చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో దూడ మృత్యువాత పడింది. ఇలా చిరుతుల సంచారం పెరిగి వరుస దాడులు చేస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని సవిూప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.