చివరి భూముల వరకు నీటి విడుదలయ్యేలా ప్రణాళిక
నల్లగొండ,డిసెంబర్15(జనంసాక్షి): యాసంగిలో ఎడమకాల్వ పరిధిలోని వివిధ మేజర్ల చివరి భూములు ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేలాగా ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసింది.నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని పలు మేజర్లకు ప్రభుత్వం యాసంగిలో టేల్ అండ్ హెడ్ పద్దతిన నీటి విడుదల చేయనుంది. ఇందుకుగాను సాగర్ ఎడమకాల్వ పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మేజర్ కాల్వల చివరి భూములకు నీరందించేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ల పర్యావేక్షణలో ఎన్‌ఎస్పీ అధికారులు, రెవెన్యూ అధికారులతో మానిటరింగ్ చేపట్టనున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను బట్టి ఎడమకాల్వకు ఎప్రిల్ 5వరకు వారబంధి విధానంలో ఎడమకాల్వ ఆయకట్టుకు, ఆరుతడి పంటలకు ప్రభుత్వం 8 విడతలుగా ప్రభుత్వం నీటిని విడుదల చేయనుంది. నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు ఎన్‌ఎస్పీ స్థాయి అధికారులు, వీఆర్వో, వీఆర్వోల వరకు ఎడమకాల్వ నీటివిడుదల వాడకంపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయనున్నారు. సాగర్ ఎడమకాల్వ పరిధిలో ప్రథమమైన రాజవరం మేజర్ మొదలుకొని ఖమ్మం జిల్లా పాలేరు వరకు ఉన్న రాజవరం, సూరేపల్లి, నారేళ్లగూడెం, ముదిమానిక్యం, వజీరాబాద్, జానాపహాడ్ తదితర మేజర్ల కింద టేలాండ్ చివరి భూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈనేపథ్యంలో ఎడమకాల్వ పరిధిలోని మేజర్ల కింద చివరి భూములకు యాసంగిలో సాగునీటిని సక్రమంగా అందించేందుకు ఎన్‌ఎస్పీ, రెవెన్యూ యంత్రాంగం కృషిచేయాల్సిన అవసరం ఉంది.