చీలిక దిశగా జేడీయూ

న్యూఢిల్లీ,ఆగష్టు 12(జనంసాక్షి):జేడీయులో చీలికకు సమయం ఆసన్నమైంది. బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, జేడీయు మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ మధ్య విభేదాలు మరింతగా ఎక్కువయ్యాయి. బీజేపీ సహకారంతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అలక వహించిన శరద్‌ యాదవ్‌ కు ముఖ్యమంత్రి నితీశ్‌ శనివారం పెద్ద షాక్‌ ఇచ్చారు. రాజ్యసభలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న శరద్‌ యాదవ్‌ ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఈ విషయంపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడుకు నితీశ్‌ సమాచారం ఇచ్చారు. కొత్త ప్రతినిధిగా తన సన్నిహితుడు అయిన ఆర్సీపీ సింగ్‌ పేరును ప్రతిపాదించారు. మొత్తం జేడీయూ తరపున పార్లమెంట్‌లో ఇద్దరు లోక్‌ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు శరద్‌ యాదవ్‌ కొత్త పార్టీని స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మద్ధతుదారులను ఏకం చేసేందుకు రాష్ట్రంలో ర్యాలీ నిర్వహించిన తర్వాత శరద్‌ యాదవ్‌ పార్టీ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి.