చురుకుగా గ్రామనర్సరీల ఏర్పాటు
జిల్లాలో 2.4కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యం
జగిత్యాల,ఫిబ్రవరి12(జనంసాక్షి): జిల్లాలో ఒక గ్రామం ఒక నర్సరీ కార్యక్రమంలో భాగంగా 295 నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీవో అదనపు పీడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఇందులో ఇప్పటి వరకు 294 నర్సరీల్లో పనులు ప్రారంభమయ్యయి. జిల్లాలో 2.4కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో 75లక్షల వరకు బ్యాగుల్లో మట్టిని నింపడం పూర్తయింది. ఆయా నర్సరీల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే హరితహారం కార్యక్రమంలో ప్రజలకు అవసరమయ్యే మొక్కలను సిద్ధం చేసి అందిస్తామని అన్నారు. అటవీశాఖ, డ్వామా ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు ఆయా నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి గ్రామం ప్రారంభంలో, గ్రామం చివరలో,
పొలంగట్లు, ప్రధాన రహదారులు, ఖాళీ స్థలాలు, బీడు భూముల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, ఎస్సారెస్పీ కెనాల్ పక్కన, రహదారుల పక్కన, చెరువు, పొలం గట్ల, అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీశాఖ, డ్వామా ద్వారా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో వివిధ ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. జిల్లాలో ఒక గ్రామం..ఒక నర్సరీ కార్యక్రమం ద్వారా ఆయా గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వన నర్సరీలను పరిశీలించి వివరాలు తెలుసుకొని నర్సరీల ఏర్పాటులో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలిస్తున్నారు. మండలాల్లో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ఆయా నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఉపాధి హావిూ ద్వారా స్థలాలను గుర్తించి జూలైలో నిర్వహించే హరితహారం కార్యక్రమంలో అందరి భాగస్వామ్యంతో లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఇందుకు అనుగుణంగా మండలాల్లో ఒక గ్రామం..ఒక నర్సరీ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన నర్సరీల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. విత్తనాలు రాగానే బ్యాగుల్లో విత్తడంతో పాటు, నీళ్లను అందిస్తే మొక్కలు పెరుగుతాయి. హరితహారం కార్యక్రమంలో ప్రతి
గ్రామంలో గ్రామస్తులకు కావాల్సిన మొక్కలను గుర్తించి వాటినే పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక గ్రామానికి ఒక నర్సరీ కార్యక్రమంలో భాగంగా సర్కారు ఆదేశాల మేరకు జిల్లాలోని 18మండలాల్లో మొత్తం 380 గ్రామ పంచాయతీలు ఉండగా డీఆర్డీవో ఆధ్వర్యంలో 295 నర్సరీలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో మరో 85నర్సరీలు పెట్టి మొక్కలు పెంచే ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే 294నర్సరీల కోసం స్థలాను కేటాయించి 75లక్షల బ్యాగుల్లో మట్టి నింపే పనులు కూడా పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హారితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికీ ఒక నర్సరీ ఏర్పాటు చేసేందుకు అధికారయంత్రాంగం సన్నద్ధమవుతున్నది. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామంలోనూ అధికారులు నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. జూలైలో నిర్వహించే ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళిలతో ముందుకేళ్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని అటవీభూములు, వ్యవసాయ భూముల గట్లపై మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిచినట్లు చెబుతున్నారు.