చెత్తతో విద్యుత్‌

5

– జీహెచ్‌ఎంసీ కమిటీలతో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,జూన్‌9(జనంసాక్షి):

హైదరాబాద్‌లో చెత్త నిర్వహణ ప్తరిష్టాత్మకంగా చేపట్టాలని, క్లీన్‌ హైదరాబాద్‌ కార్యక్రమం చురుకుగా సాగాలని ససిఎం కెసిఆర్‌ అన్నారు. చెత్తతో ఇంధనం విద్యుత్‌ తయారు చేసే అంశాలను కూడా పరిశీలించాలన్నారు.  చెత్త నిర్వహణ, వసతుల కల్పనపై ప్రజా ప్రతినిధులు అధ్యయనం చేయాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు కోరారు. ఇప్పటికే గతంలో చర్చించిన అంశాలను పునశ్చరణ చేశారు. మంగళవారం ఎంసీహెచ్‌ఆర్డీసీలో ఆయన జీహెచ్‌ఎంసీ కమిటీలతో భేటీ అయ్యారు. కమిటీలు సమర్పించిన నివేదికలపై చర్చ జరిపారు. హైదరాబాద్‌ నగరంలో దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలు, స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. నగరాభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు జీహెచ్‌ఎంసీకే కాకుండా హెచ్‌ఎండీఏ పరిధిలో కూడా ఉండాలన్నారు. హైదరాబాద్‌ను తీర్చి దిద్దే విషయంలో కమిటీలు ఇచ్చిన నివేదికలకు అనుగుణంగానే ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు.

ఇప్పటికే హైదరాబాద్‌లో సమస్యలు, పరిష్కారాల మార్గాలపై ప్రజా ప్రతినిధులు నివేదికలు అందజేశారని తెలిపారు. ఈనెల 13, 14, 15 తేదీల్లో ఢిల్లీ, నాగ్‌పూర్‌, జైపూర్‌లలో ప్రజా ప్రతినిధులు పర్యటించాలని సీఎం కోరారు. చెత్త నిర్వహణ, వసతుల కల్పన అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. పర్యటన తర్వాత మరోసారి సమావేశమై కీలక, తుది నిర్ణయాలు తీసుకుందామని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునే వరకు ప్రయోగాత్మకంగా చెత్త సేకరణకు కొన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెత్త సేకరణకు ఎన్ని ఆటో ట్రాలీలు కావాలి, ఎన్ని రిక్షాలు కావాలి, ఎన్ని ఇండ్లకు ఒక వాహనం సమకూర్చాలి, తదితర విషయాల్లో స్పష్టత కోసం ప్రయోగాత్మకంగా సర్కిల్‌ వారీగా కొన్ని వాహనాలు తిప్పాలని పేర్కొన్నారు. ఇండ్లలోని చెత్తతోపాటు షాపులు, ఆస్పత్రులు, ఫంక్షన్‌ హాల్లు, మార్కెటు ప్రాంతాల్లోని

చెత్తను తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం నగరంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ, నిర్వీర్యం కోసం రామ్‌కీ ఆధ్వర్యంలో జరిగే పనులపై కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ విషయాన్ని తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ ద్వారా అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారాలకు నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. నగరంలోని వరద నీటి కాలువల్లో పూడికను తొలగించాలని అధికారులను ఆదేశించారు. లో వోల్టేజీ సమస్య పరిష్కారం, ఇండ్లపై హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్ల తొలగింపునకు సీఎం ఆదేశించారు.  ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, హెచ్‌ఎండీఏ, విద్యుత్‌ విభాగాల సబ్‌ కమిటీలతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.