చెత్తా చెదారం – రోడ్డుపై నిల్వ ఉంటున్న మురుగునీరు – దుర్వాసన, దోమల, అంటు వ్యాధులతోగిరిజనుల ఇబ్బందులు
పెద్దవంగర జులై 18(జనం సాక్షి )
మండలలోని రామచంద్రు తండాలో మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ డ్రైనేజీ కాలువల గుండా మురుగునీరు ప్రవహించే మార్గం లేక డ్రైనేజీ కాలువ నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పడు ఎలాంటి రోగాల బారిన పడాల్సివస్తుందోనని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తండాలో నివసించే ప్రజలు ఇళ్లముందు కాలువల్లో మురుగు నీరు ఉన్నప్పటికీ తమ తలరాతలు ఇంతేనని గడుపుతూ వస్తున్నారు. దుర్వాసన వెదజల్లుతుండటంతో అనేక మందికి రోగాల భారిన పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండటంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడతానేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిండి దోమల వ్యాప్తికి వృద్ధి చెందుతుంది.ఈ అస్తవ్యస్త డ్రైనేజీ కారణంగా స్థానికులు ప్రతి రోజూ మురుగు నీటి మధ్య సహజీవనం సాగిస్తున్నారు. దీంతో రోగాలకు గురవుతున్న పరిస్థితులు దాపరిస్తున్నాయి. అధికారులు మాత్రం ఇలాంటి వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ప్రజలు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇప్పటికైనా అధికారులు మురుగు నీరు నిల్వ ఉండకుండా వెళ్లే మార్గం దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.