చెన్నైకి లెమూర్‌ కోతులు

tam-top1aథాయ్‌ల్యాండ్‌ నుంచి అక్రమ రవాణా
విమానాశ్రయంలో కలకలం

చెన్నై : దేశ, విదేశాల నుంచి అక్రమ రవాణాకు చెన్నై విమానాశ్రయం రాజమార్గంగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి చెన్నై విమానాశ్రయానికి బంగారం, మాదక ద్రవ్యాలు వంటి వస్తువులతోపాటు తాబేళ్లు వంటి మూగప్రాణులను కూడా తీసుకువస్తున్నారు. ఇటువంటి సంఘటనలు చెన్నై విమానాశ్రయంలో నిత్యకృత్యంగా మారాయి. తాజాగా థాయ్‌ల్యాండ్‌ నుంచి ‘లెమూర్‌’ జాతికి చెందిన అరుదైన మూడు కోతులను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం చెన్నై విమానాశ్రయానికి తీసుకువచ్చారు. వాటిని తీసుకువచ్చింది ఎవరో గుర్తించేందుకు పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటన విమానాశ్రయంలో కలకలం రేపింది. థాయ్‌ల్యాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి టైగర్‌ ఎయిర్‌లైన్‌ విమానం ఒకటి గురువారం వేకువజామున 2.30 గంటలకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికుల లగేజీలను అధికారులు సోదా చేస్తున్న సమయంలో అక్కడ ఎవరికీ చెందని రెండు ట్రావల్‌ బ్యాగులు కనిపించాయి. ఆ బ్యాగులు విమానంలో తీసుకువచ్చినట్లు తగిలించిన టోకన్‌ను సగం చింపి వేసి ఉన్నట్లు తెలిసింది. గాలి లోపలికి వెళ్లే విధంగా కొంత తెరిచి ఉన్నాయి. వాటిని గమనించిన అధికారులు వెంటనే విమానాశ్రయ భద్రతాధికారులకు సమాచారం అందజేశారు. భద్రతాధికారులు సోదా చేయగా, అందులో బాంబులు లేవని తెలిసింది. ఆ బ్యాగులను పూర్తిగా తెరిచి చూడగా అరుదైన లెమూర్‌ జాతికి చెందిన మూడు కోతులు ఉన్నాయి. వాటిని ఎవరు తీసుకువచ్చారు. ఎందుకు వదలి వెళ్లారనే దిశగా విచారిస్తున్నారు. అనంతరం ఆ కోతులకు విమానాశ్రయంలో ఉన్న వెటరినరీ వైద్యులు పరీక్షలు చేశారు. ఆ తర్వాత వాటిని అక్రమంగా తీసుకువచ్చినట్లు గుర్తించారు. ఈ కోతులను మన దేశంలో పెంచడం వీలు కాదు. చలి ప్రదేశాలలో మాత్రమే జీవించగల ఈ కోతులను అధికారులు ఏసీ గదిలో ఉంచి, వాటికి ఆహారంగా పలు రకాల పండ్లను అందించారు. అనంతరం ఈ విషయాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న కేంద్ర అటవీ శాఖ అధికారులను సంప్రదించగా, వారు తీసుకువచ్చిన దేశానికే తరలించమని సూచించారు. దీంతో ఈ అరుదైన కోతులను థాయ్‌ల్యాండ్‌కు తరలించాలని నిర్ణయించారు. ఈ విషయం గురించి చెన్నై విమానాశ్రయ అధికారి ఒకరు మాట్లాడుతూ నిద్ర మేల్కొన్న వెంటనే లెమూర్‌ కోతులను చూస్తే అదృష్టమని కొందరి నమ్మకమని, అందువలన వీటిని అక్రమంగా తీసుకుని వచ్చి ఉండవచ్చునని పేర్కొన్నారు. ఈ అరుదైన కోతులు సుమారు రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగానే ధర పలుకుతాయని అధికారుల అంచనా. ఈ కోతులను శుక్రవారం వేకువజామున 4.00 గంటలకు విమానం ద్వారా థాయ్‌ల్యాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా కస్టమ్స్‌ అధికారులు కేసు నమోదు చేసి లెమూర్‌ కోతులను ఎవరు తీసుకువచ్చారనే విషయమై తీవ్రంగా విచారిస్తున్నారు.