చెన్నైని కుదిపేసిన వార్ధా

ఊహించినట్లుగానే వార్ధా చెన్నై మహానగరాన్ని కుదిపేసింది. అతి తీవ్రమైన వేగంతో ఈదురుగాలులు ఒకవైపు, ఎడతెరపి లేకుండా మహా కుంభవృష్టి మరోవైపు నగరాన్ని అల్లకల్లోలం చేశాయి. కొట్టుకుపోయిన రోడ్లు, కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన కరెంటు తీగలు, కూకటి వేళ్లతో పెకలించుకుపోయిన మహావృక్షాలు నగరంలో వార్ధా విధ్వంసానికి దర్పణం పట్టాయి. మధ్యాహ్నంvardha-cyclone రెండు గంటలకు చెన్నై తీరాన్ని తాకిన తుపాను, ఆంధ్రప్రదేశ్‌పై కాస్తంత కనికరం చూపింది. చైన్నైకి సమీపంలో ఉన్న నెల్లూరు, చిత్తూరు నగరాలను భారీ వర్షాలతో సరిపెట్టింది. దీంతో రాష్ట్రానికి పెను విధ్వంసం ముప్పు తప్పింది. ఆధ్యాత్మిక శిఖరం తిరుమలలో నాలుగు గంటల వ్యవధిలో 12సెంటీమీటర్ల వర్షం కురిసింది. తుపాను ధాటికి ప్రాథమిక సమాచారం ప్రకారం చెన్నైలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భారత వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ‘చెన్నై నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వార్ధా పొంచి ఉంది. ఏ క్షణంలోనైనా నగరంపై విరుచుకుపడవచ్చు’ అని వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఎం. మహాపాత్ర వెల్లడించారు. చెన్నైకి సమీపంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వాచే అవకాశం ఉందని, భారీగా వర్షాలు పడతాయని కూడా ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరిక జారీ అయిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెన్నై నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉత్తర చెన్నై ప్రాంతంలోని దాదాపు 8వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.