చెన్నైలో అళగిరి శాంతి ప్రదర్శన

ర్యాలీగా తండ్రి కరుణ సమాధి వద్ద నివాళి

బలప్రదర్శనతో స్టాలిన్‌కు సవాల్‌

చెన్నై,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తమ్ముడు స్టాలిన్‌ తీరుకు నిరసనగా అళగిరి చెన్నైలో భారీ ప్రదర్శన చేపట్టారు. దీంతో తమిళనాట డీఎంకే పార్టీలో కొనసాగుతున్న అన్నదమ్ముల ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. ఆ పార్టీ బహిష్కృత నేత ఎంకే అళగిరి మెరీనా బీచ్‌లోని డీఎంకే దివంగత చీఫ్‌ కరుణానిధి మెమోరియల్‌ వద్ద బలపదర్శన నిర్వహించారు. నలుపురంగు దుస్తులు ధరించిన అళగిరి, ఆయన మద్దతుదారులు ట్రిప్లికేన్‌ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. కొద్దిదూరం కాలినడకన వెళ్లిన ఆయన.. అనంతరం ఓపెన్‌ టాప్‌ వాహనంలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. పలు జిల్లాల నుంచి తరలివచ్చిన అళగిరి మద్దతుదారులు… చేయి చేయి కలుపుదాం… పార్టీని కాపాడదాం..అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మధురైకి చెందిన పీఎం మన్నన్‌ సహా పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.తన తండ్రి మరణంపై సంతాపం తెలిపేందుకు చెన్నైలో ‘శాంతి ర్యాలీ’ నిర్వహిస్తానంటూ అళగిరి ప్రకటించిన సంగతి తెలిసిందే. తనను పార్టీలోకి తిరిగి చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవనీ… సెప్టెంబర్‌ 5 ర్యాలీ తర్వాత తన భవిష్యత్‌ వ్యూహం ప్రకటిస్తానంటూ చెప్పారు. అనంతరం కొద్దిగా మెత్తబడిన ఆయన తనను పార్టీలోకి చేర్చుకుంటే డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ను అంగీకరించేందుకు సిద్ధమని కూడా ప్రకటించారు. కాగా పార్టీని కాపాడేందుకే తాను మళ్లీ చేరాలనుకుంటున్నానని అళగిరి చెబుతున్నారు. ఇప్పటివరకు కరుణానిధి ఉన్నారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మేము పార్టీలో చేరాలనుకుంటున్నాం. వాళ్ల మమ్మల్ని పార్టీలో చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అని అళగిరి చెబుతున్నారు. అయితే ఇటీవల డీఎంకే చీఫ్‌గా తండ్రి స్థానంలో బాధ్యతలు చేపట్టిన స్టాలిన్‌… తనకు సోదరుడే లేడు అంటూ వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్యా మరింత అగ్గి రాజుకుంది. తండ్రి మరణం తర్వాత కూడా ఆయన చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో తనను పార్టీలోకి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలే ఉంటాయని తమ్ముడికి, డీఎంకేకు గట్టి హెచ్చరికలు పంపారు. ఇంత జరిగినా డీఎంకే నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో తాను ముందుగా ప్రకటించినట్లే చెన్నైలో నేడు శాంతియుత ర్యాలీ చేపట్టారు.ర్యాలీ నేపథ్యంలో చెన్నైలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

————–