చెన్నైలో భారీ వర్షాలు

HY21RAIN_760842fచెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. 30 డిగ్రీల సెల్సియస్ కిందకు పడ్డాయి.  సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల్లో చెన్నైలో 67 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రాంతీయ వాతావరణ శాఖ వెల్లడించింది.

2010 తర్వాత మే నెలలో ఒక్కరోజులో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనని తెలిపింది. 2010, మే 10న చెన్నైలో 109.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో చెన్నై వాసులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఓటు వేయడానికి స్వస్థలాలకు వెళ్లి నగరానికి తిరిగొచ్చేవారు ట్రాఫిక్ లో చిచ్చుకుపోయారు.

మంగళ, బుధవారాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. పంబన్ లో అత్యధికంగా 79.6 మిల్లీమీటర్లు, నాగపట్టణంలో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.