చెన్నై చేరుకోనున్న ప్రముఖులు

 fotorcreatedsa1సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవదేహాన్ని ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్‌కు తరలించారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం దివంగత నేత పార్థివ దేహాన్ని ప్రఖ్యాత రాజాజీ హాల్‌కు తరలించారు. ప్రజల సందర్శనార్థం మంగళవారం సాయంత్రం వరకు అక్కడే ఉంచుతారు. ‘అమ్మ’ను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. వేలాదిగా ప్రజలు తరలివస్తుండటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మెరీనా బీచ్‌లో ఎంజీఆర్ సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు చేయనున్నారు. నేడు చెన్నైకి రాష్ట్రపతి, ప్రధాని: భారీ బందోబస్తు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్థీవ దేహానికి నివాళులు అర్పించేందుకు పలువురు ప్రముఖులు మంగళవారం చెన్నై నగరానికి రానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు చెన్నై చేరుకోనున్నారు. నేరుగా రాజాజీహాల్‌కు చేరుకుని ‘అమ్మ’ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. వారి రాక సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.