చెరుకు పంట మద్దతు ధర రూ.3వేల చెల్లించాలి
నిజామాబాద్, అక్టోబర్ 29 : నిజామాబాద్ జిల్లాలోని గాయత్రి షుగర్ ప్యాక్టరీ చెరుకు రైతులకు టన్నుకు మూడు వేల రూపాయలు చెల్లించాలని కామారెడ్డి డివిజన్ చెరుకు పంట ఉత్పత్తి దారులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్యాక్టరీ యాజమాన్యం చెరుకు ధర 2400 ప్రకటించిందని, రైతులకు గిట్టుబాటు కాదని, టన్నుకు మూడు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తుందని జేఏసీ నాయకులు ఆరోపించారు. యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. గత స ంవత్సరం చక్కెర ధర కిలోకు 26 రూపాయలు ఉండగా రైతులకు చెరుకు టన్నుకు 2200 చెల్లించారని, ప్రస్తుతం చక్కెర ధర 40 నుండి 42 రూపాయలు కిలో ఉందని, చెరకు ధర 2400 రూపాయలు చెల్లించడం సమంజసమా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో 3500 నుండి 4400 రూపాయల వరకు చెల్లిస్తున్నారని వారు తెలియజేశారు. రైతుల డిమాండ్ మేరకు ధర చెల్లించకపోతే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారని అన్నారు.