.చైనా,రష్యాల్లో కోవిడ్‌ విజృంభణ

` డెల్టా వేరియంట్‌తో చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌

` రష్యా గజగజ..రికార్డు స్థాయిలో కేసులు,మరణాల నమోదు

మాస్కో,అక్టోబరు 26(జనంసాక్షి):కరోనా మహమ్మారి రష్యాను చిగురుటాకులా వణికిస్తోంది. నిత్యం 30 వేలకు పైగా కేసులు, వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోతోంది. తాజాగా రికార్డు స్థాయిలో రోగబాధితులు మృత్యు ఒడికి చేరుకున్నారు. 24 గంటల వ్యవధిలో 1,106 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఆ దేశంలో అడుగుపెట్టిన దగ్గరి నుంచి ఇవే అత్యధిక మరణాలు కావడం గమనార్హం. నిన్న 36,446 మందికి వైరస్‌ సోకింది. మరో విషయం ఏంటంటే..  గణాంకాలను పరిశీలిస్తే, మనదేశంతో పోలిస్తే అక్కడ మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ ఏడు వరకు సెలవులు ప్రకటించింది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మ్యూజియాలు, థియేటర్లు, కన్సర్ట్‌ హాల్స్‌ వంటి ప్రదేశాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశం ఉంది. అదీ టీకా తీసుకున్న వారికి మాత్రమే. 60 ఏళ్లు పైబడి, టీకా తీసుకోని వ్యక్తులు ఇంట్లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధికారులను ఆదేశించారు. మాస్కుల వినియోగాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఒకవైపు కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తే.. అక్కడి ప్రజలు వాటిని విహార యాత్రలతో సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో విమాన టికెట్ల అమ్ముడయ్యాయని, హోటళ్లలో గదులు నిండిపోతున్నాయని, పర్యాటక ప్యాకేజీలకు డిమాండ్‌ పెరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కువమందికి టీకాలు తీసుకోకపోవడమే తాజా వైరస్‌ ఉద్ధృతికి కారణమని నిపుణులు అంటున్నారు. 146 మిలియన్ల జనాభాలో కేవలం 49 మిలియన్ల మంది మాత్రమే పూర్తిగా టీకా వేయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదట టీకాను ఆవిష్కరించిన ఆ దేశంలో వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు అక్కడ 83 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 2.3లక్షల మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు.చైనాలో మళ్లీ కరోనా కలకలం.. పలు నగరాల్లో లాక్‌డౌన్‌లు..!చైనాలో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దాంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌లు విధిస్తున్నది. చైనాలో మూడిరట ఒక వంతు అంటే దాదాపు 11 ప్రావిన్స్‌లలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గత వారం రోజుల వ్యవధిలో ఈ 11 ప్రావిన్స్‌లలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో చైనా సర్కారు కొవిడ్‌ నిబంధనలను కఠినతరం చేస్తున్నది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నది. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోని ప్రావిన్స్‌లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గాన్సు, ఇన్నర్‌ మంగోలియా, నింగ్‌ క్సియా, గుయిజౌ, బీజింగ్‌ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నది. దాంతో ఆయా ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలను అధికారులు మూసివేశారు. మరోవైపు దేశ రాజధాని బీజింగ్‌లో ఇప్పటివరకు 14 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. నగరంలోకి వచ్చే వారికి అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.