చేనేతకు ఉరి
` జిఎస్టీ పెంపు అనాలోచిత చర్య
` మంత్రి కేటీఆర్
హైదరాబాద్,డిసెంబరు 24(జనంసాక్షి): టెక్స్‌టైల్ పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండిరచారు. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమకు మరణశాసనమని అన్నారు. టెక్స్ టైల్ పై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం సరికాదని కేటీఆర్ ట్వీట్ చేశారు. మేకిన్ ఇండియా అని ఉపన్యాసాలు ఇచ్చే మోడీ వస్త్ర పరిశ్రమను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్వదేశంలో వస్త్ర తయారీకి సహకారం అందించాలని కోరారు. ఈ విషయంలో మోడీ జోక్యం చేసుకుని చేనేత కార్మికులను కాపాడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని మంత్రి మరోసారి తప్పుబట్టారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు, జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీరుపై ప్రశ్నలు సంధించారు.మేకిన్ ఇండియా అంటూ రోజూ ఉపన్యాసాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం.. స్వదేశంలో వస్త్ర తయారీ పరిశ్రమకు సహకారమందించాల్సింది పోయి జీఎస్టీని 5 నుంచి 12శాతానికి పెంచిందని ఆక్షేపించారు. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమకు మరణశాసనం రాస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. జాతీయ చేనేత దినోత్సవం రోజే చేనేతకు చేయూతనిస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే నేతన్నలను కాపాడాలన్నారు. మరోవైపు, నియోజకవర్గాల పునర్‌విభజన విషయంలోనూ కేంద్రం ద్వంద్వ వైఖరినే అవలంబిస్తోందంటూ కేటీఆర్ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌కు ఒక నిబంధన దక్షిణాదికి మరో నిబంధనా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ప్రజల్ని వేరుగా చూడటం విడ్డూరంగా ఉందన్నారు.