చేనేతకు చేయూత ఇవ్వని కేంద్రం


` కేంద్రానికి ఏడు సార్లు లేఖలు రాసినా స్పందన లేదు
` పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
` సిరిసిల్లలో మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కోసం మరోసారి కేంద్రానికి లేఖ
` అందుకు అవసరమైన అన్ని రకాల అవకాశాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి
` దశాబ్దాలుగా సిరిసిల్ల పట్టణంలో నాణ్యమైన పవర్లూమ్‌ రంగ మానవ వనరులు
` పవర్లూమ్‌ కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడి
హైదరాబాద్‌,నవంబరు 14(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం వెంటనే సిరిసిల్లలో మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ని ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కాంప్రహెన్సివ్‌ పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ డెవలప్మెంట్‌ స్కీమ్‌ లో భాగంగా ఈ పవర్లూమ్‌ క్లస్టర్‌ ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పియుష్‌ గోయల్‌ కు ఒక లేఖ రాశారు ఇప్పటికే ఈ పవర్లూమ్‌ క్లస్టర్‌ కోసం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాయడంతో పాటు వ్యక్తిగతంగా ఢల్లీి వెళ్లి సిరిసిల్లలో మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా… ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో అత్యధిక శాతం పవర్లూమ్‌ కార్మికులు ఉన్న పట్టణం సిరిసిల్ల అని, గత కొన్ని దశాబ్దాలుగా సిరిసిల్ల పట్టణంలో నాణ్యమైన పవర్లూమ్‌ రంగ మానవ వనరులు ఉన్నాయన్నారు. మెగా పవర్లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల అవకాశాలు సిరిసిల్లలో ఉన్నాయని, కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు.మరోవైపు రాష్ట్రంలోని పవర్లూమ్‌ కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని నేతన్నలకు కు 40 శాతం సబ్సిడీతో కూడిన వెజ్‌ కంపెన్సెషన్‌ స్కీమ్‌, పొదుపు పథకం (నేతన్నకు చేయూత)తోపాటు పవర్లూమ్‌ కార్మికుల ఉపాధి పెరిగేలా అనేక చర్యలు తీసుకున్నామని, దీంతో గతాన్ని కంటే భిన్నంగా చేతినిండా నేతన్నలకి పని లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్స్టైల్‌ రంగం లో చేపట్టిన కార్యక్రమాలను కేంద్రం ఇప్పటికే పలుసార్లు ప్రశంసించిన విషయాన్ని సైతం గుర్తు చేశారు అయితే టెక్స్టైల్‌ రంగం కేంద్రం నుంచి రాష్ట్రంలోని నేతన్నలకు సరైన ప్రోత్సాహం రాకపోవడం పట్ల మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలకు అండగా నిలవడం అంటే దేశంలోని టెక్స్టైల్‌ రంగానికి అండగా నిలవడమేనని భావించాలని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి సరైన మద్దతు ఇవ్వకపోవడంతో దేశంలోని అనేక చిన్న దేశాలను సైతం దేశం టెక్స్టైల్‌ రంగం లో పోటీ పడలేకపోతున్నదని కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకుండానే టెక్స్టైల్‌ రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించగాగలిగమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా టెక్స్టైల్‌ పరిశ్రమ కి అనుకూల వాతావరణం లేని రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్న కేంద్రం, అన్ని రకాల మౌలిక వసతులు, అద్భుతమైన నైపుణ్యం కలిగిన తెలంగాణ టెక్స్టైల్‌ రంగానికి మాత్రం సరైన అవకాశం ప్రోత్సాహం ఇవ్వడం లేదని కేటీఆర్‌ అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో టెక్స్టైల్‌ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించేలా మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ని సిరిసిల్లలో వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రము తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తన లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.