చేనేతలకు అన్నివిధాల అండగా ఉంటాం
– చేనేతకు రూ. 400 కోట్లుకుపైగా నిధులు కేటాయించాం
– కేంద్ర బడ్జెట్‌తో పోలిస్తే చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులెక్కువ
– చేనేత మగ్గాల లెక్క తేల్చేందుకు జియో ట్యాగింగ్ చేశాం
– రాష్ట్రంలో 17,573 మగ్గాలపై 42వేల మందిజీవిస్తున్నారు
– చేనేత మిత్ర పథకాన్ని రూపొందించిన ఘనత కేసీఆర్‌దే
– టెస్కో షోరూమ్‌లను పెంచబోతున్నాం
– ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా చేనేత వస్త్రాలను అమ్మే వెసులుబాటు కల్పిస్తాం
– రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
– పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు7(జనంసాక్షి) : చేనేతలను అన్ని విధాలుగా ఆదుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ చేనేత కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వమని కేటీఆర్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌తో పోలిస్తే చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎక్కువ అని కేటీఆర్ గుర్తు చేశారు. చేనేతకు రూ. 400 కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అని చెప్పారు. చేనేత మగ్గాల లెక్క తేల్చేందుకు జియో ట్యాగింగ్ చేశామన్నారు. రాష్ట్రంలో 17,573 మగ్గాలు ఉన్నాయన్న కేటీఆర్ తెలిపారు. 42 వేల మందికి పైగా వీటిపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ఒడిశా అధికారులు మన పథకాలను మెచ్చుకున్నారని పేర్కొన్నారు. చేనేత కార్మికుల జీవన స్థితిగతుల గురించి సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు అని కేటీఆర్ అన్నారు. చేనేత మిత్ర పథకాన్ని రూపొందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతుందన్నారు. చేనేత మిత్ర పథకంలో ఎప్పుడైనా చేరొచ్చు అని సూచించారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత పథకాలతో నేతన్నలు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందన్నారు కేటీఆర్. ఈ ఆర్థిక సంవత్సరం నేతన్న చేయూత కింద రూ. 60 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రతి నేత కళాకారుడి ఇంట్లో నెలకు రూ. 6 వేల ఆదాయం రావాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఉన్న చేనేత రుణాలన్నీ మాఫీ చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. టెస్కో షోరూమ్‌లను పెంచబోతున్నామని తెలిపారు. ఈ కామర్స్ రంగం కూడా కొత్త పుంతలు తొక్కింది. ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా చేనేత వస్త్రాలను అమ్మే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఈ రోజు సాయంత్రం ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.