చేనేత స్టాళ్లు, మగ్గాలు దర్శించిన  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తయారీ, విక్రయాలపై ఆయా సంఘాలలతో ముఖాముఖి
చేనేత కార్మికులతొ మాట్లాడిన రాష్ట్రపతి
పట్టు చీరల అమ్మకాలకు ప్రచారం కల్పించండి
పోచంపల్లి పట్టు చీరలకు బ్రాండ్‌ కల్పించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి
యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌20 జనంసాక్షి) : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో పర్యటించారు. అక్కడ శ్రీరంజన్‌ వీవ్స్‌ ను సందర్శించి మగ్గం నేయడం, స్పిన్నింగ్‌, రీలింగ్‌ తదితర ప్రక్రియలను పరిశీలించారు. స్థానికంగా ఓ ఫంక్షన్‌ హాల్‌ లో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లు, మగ్గాలు దర్శించారు. అనంతరం చేనేత ఇక్కత్‌ వస్త్రాల తయారీ, విక్రయాలపై ఆయా సంఘాలలతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడారు. అనంతరం రాష్ట్రపతితో చేనేత కార్మికులు మాట్లాడారు. ఆజాది కా అమృత్‌ వేడుకల్లో భాగంగా తమ డబల్‌ ఇక్కత్‌ ప్రదర్శన చేసుకోవాల్సి రావడం అదృష్టమని డబల్‌ ఇక్కత్‌ లో నిపుణురాలు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ పురస్కారం గ్రహీత భోగ సరస్వతి అన్నారు. నూలు యార్న్‌ సరిగ్గా సరైన సమయంలో అందడం లేదన్నారు. యార్న్‌ డిపో పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక లోక శ్యామ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. చేతేతకు సంబంధించిన జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మమ్ములను కార్మికులుగా కాకుండా కళాకారులుగా గుర్తించాలని వేడుకొన్నారు. ఇక మరోవైపు కూరపాటి వెంకటేశం మాట్లాడుతూ.. ఇక్కత్‌ పట్టు చీరల అమ్మకాలకు ప్రచారం కల్పించాలని కోరారు. పోచంపల్లి పట్టు చీరలకు బ్రాండ్‌ కల్పించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు వినతుల అంతరం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తుందన్నారు. పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ గుర్తింపు లభించిందన్నారు. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందించడం అభినందనీయమన్నారు. చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న అవార్డు గ్రహీతలందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలన్నారు. చేనేత కళ ఒకరి నుండి మరొకరికి వారసత్వంగా కొనసాగడం, గురు శిష్య బంధాన్ని ఏర్పరచడం అభినందనీయమన్నారు. చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం, అధికారులు మరింత చొరవ చూపాలన్నారు.