చేపల ధరలపై కార్తీకం దెబ్బ

అయ్యప్ప మాలధారణతో తగ్గిన అమ్మకాలు
నష్టాలతో ఆందోళనలో చేపల వ్యాపారులు
నెల్లూరు,నవంబర్‌8 (జనం సాక్షి) : కార్తీక మాసంతో పాటు, అయ్యప్ప మాల ధారణల కారణంగా మాంసం వాడకాలు తగ్గాయి. చేపల రైతులపైనా ఇది పడింది. కొనుగోళ్లు తగ్గడంతో ధరలు కూడా పడిపోయాయి.  నెల రోజుల కిందట ఉన్న చేపల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇదేమిటని కొనుగోలుదారులను రైతులు ప్రశ్నిస్తే.. వారిస్తున్న సమాధానం కార్తీకమాసం. దీంతో పాటు వరుసగా వస్తున్న పండుగలు, అయ్యప్ప మాలధారణ సమయం, ఇలా పలు కారణాల వల్ల చేపల ధరలు పడిపోయాయని చెబుతున్నారు. నాలుగు నెలల పాటు సాగుచేసిన చేపలను అయినకాడికి అమ్ముకోక తప్పని పరిస్థితి రైతులకు ఎదురవుతోంది.  పంగస్‌ చేపల ఉత్పత్తికి తగినంత వినియోగం దేశీయంగా లేకపోవడం వల్లే ధరలు పడిపోతున్నాయి. ఈ చేపలను బోన్‌లెస్‌ ఫిష్‌గా వినియోగించవచ్చు. అయితే దేశీయ మార్కెట్‌లో పంగస్‌ చేపల వినియోగం ప్రస్తుతం తక్కువగా ఉంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, అస్సాం రాష్టాల్రపై ఆధారపడాల్సి వస్తోంది. మన రాష్ట్రంలోనూ ఈ చేపల వినియోగంపై అవగాహన కల్పించి, మార్కెట్‌ను పెంచాల్సి ఉంది. ఉత్పత్తి ఒక్కసారిగా ఎక్కువైన సందర్భాల్లో ధరలు పడిపోయి, రైతుల లాభం దెబ్బ తింటోంది. సాగు చేసేటప్పుడు, పెట్టుబడి నియంత్రణ చేసుకోవాలి. రొయ్యల సాగుతో పాటు చేపల సాగుకు పెట్టుబడులు పెరిగిపోయాయి. గతంలో సంప్రదాయ పద్ధతిలో మేత సొంతంగా తయారుచేసుకుని వేసి, సాగు చేసేవారు. మారుతున్న కాలంతో పాటు చేపల సాగు తీరు మారిపోయింది. రెడీమేడ్‌గా దొరికే చేపల మేతలనే రైతులు వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. నీటి సరఫరా కోసం ఎక్కువ ప్రాంతాల్లో డీజిల్‌ ఇంజిన్లను వాడుతుండడంతో ఆయిల్‌ ఖర్చులు పెరిగి పోయాయి. వ్యాధుల నివారణకు వాడే మందుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో చేపల సాగు పూర్తయ్యేటప్పటికి పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. తీరా అమ్మబోతే పడిపోయిన ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
ఆదాయం రాకపోవడంతో చేపల రైతులు నష్టాల బారిన పడుతున్నారు. వెనావిూ రొయ్యల సాగు జాక్‌పాట్‌గా మారిన నేపథ్యంలో పలువురు రైతులు చేపల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కాలంలో రొయ్యల రైతులు పలువురు చేపల సాగు వైపు దృష్టి సారించారు. పంగస్‌, రూప్‌చంద్‌ వంటి రకాల చేపల సాగు వల్ల నష్టం లేకుండా, ఎంతో కొంత ఆదాయం సాధించవచ్చని భావించారు. అయితే ఉన్నట్లుండి చేపల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు. గత నెల వరకు పంగస్‌ చేపలు కిలో 50 నుంచి 60 రూపాయల వరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసేవారు. మార్కెట్‌లో ఈ చేపలను కిలో 80
నుంచి 100 రూపాయలకు అమ్ముకునేవారు. ఎకరాకు అన్ని ఖర్చులు కలుపుకుని నాలుగు లక్షల వరకు పెట్టుబడి పెడితే, సరైన దిగుబడి వస్తే రైతులు లాభం పొందే అవకాశం ఉంది. ఈ ఏడాది చేపల సాగులో గణనీయమైన దిగుబడి సాధించినా, సరైన ధర లేక రైతులు నష్టపోతున్నారు. కొనుగోలుదారులు అమాంతం ధర తగ్గించి కిలో 30 రూపాయలకు రైతుల వద్ద నుంచి కొంటున్నారు. దీంతో కష్టపడి సాగు చేసి దిగుబడి సాధించినా ఫలితం కనిపించడం లేదు.