చేపవిత్తనాల కోసం దళారులను ఆశ్రయించవద్దు

అవసరం మేరకు సంఘాలకు ప్రభుత్వమే సరఫరా

నిజామాబాద్‌,జూలై5(జ‌నం సాక్షి): మత్స్య కారులు దళారులను ఆశ్రయించి చేప పిల్లల విత్తనాలను కొనుగోలు చేసి చెరువుల్లో వదులు కోవద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి జి. రాజనర్సయ్య సూచించారు. నాణ్యమైన చేపవిత్తనాలను ప్రభుత్వమే సమకూరుస్తోందని అన్నారు. పూర్తి ఉచితంగా వంద శాతం సబ్సిడీతో మత్య్సకారులకు చేప పిల్లల విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. పరిమిత నీటి వనరులున్న చెరువుల్లో ఎంత మేరకు వేయాలో అంత వరకే చేప పిల్లలను వదలాలని అన్నారు. మత్స్య సంపదను పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలతో జిల్లాలోని మత్స్యకారులకు రూ. 100 కోట్ల మేర ఆదాయం సమకూరింది. రెండో విడతగా చేప పిల్లల పెంపకం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.ఈసారి జిల్లాలో 4.17 కోట్ల చేప పిల్లలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వీటికి సంబంధించిన టెండర్లు ఖరారయ్యాయి. జూలై నెలాఖరు నాటికి జిల్లాలో 904 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు జిల్లా మత్స్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 35.43 కోట్లను విడుదల చేసింది. మొత్తం 38 అంశాల్లో వారికి మేలు చేసేలా ఆదేశించింది. చేప పిల్లల ఉత్పత్తి, చేప పిల్లల వేట కోసం వలలు, తెప్పలు సబ్సిడీపై అందించడం, చేపల క్రయవిక్రయాల కోసం ప్రతీ మండల కేంద్రంలో షెడ్డు ఏర్పాటుకు రూ. 10 లక్షల చొప్పున నిధులు, చేపలు రిటైల్‌గా అమ్ముకోవడం కోసం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, సబ్సిడీపై కార్లు , ట్రక్కులు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నది. మహిళలకు ఒక్కో సంఘానికి రూ. 2 లక్షల గ్రాంటును అందిస్తున్నది. రివాల్వింగ్‌ ఫండ్‌ కింద వీరు ఎండు చేపల వ్యాపారం చేసుకునే వీలుంది. జిల్లాలో ఉన్న 27 మహిళా మత్స్య కార సంఘాలకు రూ. 2 లక్షల చొప్పున రూ. 54 లక్షలను అందించాం. చేపల మార్కెట్లు నిజామాబాద్‌ నగరంతో పాటు నదిపేట, జక్రాన్‌పల్లి, బోధన్‌ ఉన్నాయన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండగానే ఈ చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ప్రతీ చెరువు నీటి పరిమాణం లో 40శాతం నీరు చేరి ఉంటే వాటిలో చేపపిల్లల పెంపకాన్ని చేపడతాం. జూలై నెలాఖరు నాటికి ఈ కార్యక్రమం మొదలు పెడతామన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు గోదావరి, ఎస్సారెస్పీలో చేపల వేటను పూర్తిగా నిషేధించాం. ఈ సమయంలో చేపలు సహజ సిద్ధంగా సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. వాటిని కాపాడుకోవడం ద్వారా మత్స్య సంపద వృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ఇదిలావుంటే

ఈ సీజన్‌ నుంచి ఎస్సారెస్పీలో రొయ్య పిల్లలు వదలాలని నిర్ణయించింది. నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని మూడు వేల మంది మత్స్యకారులు ఎస్సారెస్పీలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు.ఈ సీజన్‌ నుంచే ప్రభుత్వం ఎస్సారెస్పీలో ఉచితంగా రొయ్య పిల్లలను వదులనుండడంతో మత్స్యకారులకు అదనపు ఆదాయం లభించనుంది. రాష్ట్రంలోని పలు జలాశయాల్లో ప్రయోగాత్మకంగా ఉచితంగా చేప పిల్లలను అందించింది. ఈ ప్రయోగం సక్సెస్‌ కావడంతో మరిన్ని జలాశయాల్లో రొయ్యలను ఉచితంగా వదలాలని ఇటీవలే నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎస్సారెస్పీలో రొయ్య పిల్లలను వదలనుంది.అక్టోబర్‌లో ఎస్సారెస్పీలో రొయ్య పిల్లలను వదలడానికి జిల్లా మత్స్యశాఖ రంగం సిద్ధం చేస్తోంది. రొయ్యల సాగు మంచి ఆదాయాన్ని ఇస్తుండడంతో ప్రభుత్వం ఉచితంగా రొయ్య పిల్లలు వదిలాక మరింత ఆదాయం పెరగనుందని చెబుతున్నారు. అక్టోబర్‌ లో పిల్లలు వదిలాక 6 నుంచి 8 నెలల్లో రొ య్యలు మత్స్యకారులకు అందడం ప్రారంభమవుతుంది.