చేప ప్రసాదానికి సర్వంసిద్ధం
– పంపిణీకి 1.60లక్షల చేపపిల్లలు సిద్ధం
– ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, భోజన సౌకర్యం
– ఇబ్బందులుకలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు
హైదరాబాద్, జూన్7(జనంసాక్షి) : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 8, 9 తేదీల్లో కార్యక్రమం ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు చౌక ధరలో భోజనం అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం అయ్యింది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.5కే భోజనం అందించనున్నారు. గ్రౌండ్ లో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో భక్తులు ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకున్నారు. చేపప్రసాదానికి వచ్చే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ 130ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరంలోని అన్ని ప్రాంతాలతోపాటు జేబీఎస్, సీబీఎస్, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లతోపాటు శంషాబాద్ ఏయిర్‌పోర్టు నుంచి గ్రేటర్ ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు నేడు ప్రసాదం కోసం మత్స్యశాఖ లక్షా అరవై వేల చేప పిల్లలను సిద్ధం చేసింది. జలమండలి తరఫున ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపల, బైట కూడా వాటర్ ప్యాకెట్లను ఉచితంగా అందజేయను న్నారు. పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని జీహెచ్‌ఎంసీ నియమించింది. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బ్యారికేడ్లు, ప్లడ్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ అన్ని ఏర్పాటు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. వైద్య, ఆరోగ్య శాఖ కూడా అంబులెన్సులను సిద్ధం చేసింది. వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.