చైనాలో ఘోర ప్రమాదం
– బస్సు, ట్రక్కు ఢీకొని 18 మంది దుర్మరణం
బీజింగ్, జూన్30(జనం సాక్షి) : చైనా రాజధాని బీజింగ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కోచ్ బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో 18 మంది దుర్మరణం చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. హునాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అతివేగంతో పాటు రహదారి తడిగా ఉండటంతో వాహనాలు పట్టు తప్పి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కోచ్ బస్సులో 30మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. అయితే ఘటనకు సంబంధించిన ఫొటోలను చూస్తుంటే ప్రమాదం తీవ్రస్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన తర్వాత ఒక వాహనం డివైడర్‌ను దాటి బోల్తాపడిందని అధికారులు తెలిపారు. ఘటన గురించి సమాచారమందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.