చోటా రాజన్ పట్టుబడటం వెనుక అసలు కథ ఇదీ?

91
న్యూఢిల్లీ: 55ఏళ్ల రాజన్ అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం రావడంతోనే పట్టుబడినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. భారత్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని గతేడాది నుంచి ప్లాన్ వేస్తున్నాడని, భారత్‌లో చోటారాజన్‌కు కిడ్నీ ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు. చోటారాజన్ రెండు కిడ్నీలు చెడిపోయాయని, ప్రస్తుతం ఆయన డయాలసిస్ చేయించుకుంటూ జీవిస్తున్నారని ఆ అధికారి చెప్పారు. రాజన్ మరికొంత కాలం బతకాలంటే కిడ్నీ మార్పిడి తప్పనిసరి అని అంటున్నారు. కానీ పరారీ ఖైదీగా ఉన్న రాజన్ విదేశాల్లో ఆపరేషన్ చేయించుకోవడం వీలుపడదని, ఇందులో భాగంగానే భారత్‌కు వస్తే తప్పకుండా తన కిడ్నీ మార్పిడికి అధికారులు అనుమతించే అవకాశం ఉందని రాజన్ భావిస్తున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. చోటారాజన్‌కు ఆయన మేనల్లుడు ఒకరు కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారని సమాచారం. ఈ మేరకు తన వైద్య పరీక్షల వివరాలను కుటుంబసభ్యులకు మెయిల్‌లో పంపగా… వాటిని దక్షిణ ముంబైలోని ఓ ప్రముఖ నెఫ్రాలజిస్టుకు చూపించారు. దాంతో వారిద్దరి కిడ్నీలు మ్యాచ్ అవుతున్నాయని, రాజన్‌కు మేనల్లుడు కిడ్నీ ఇవ్వొచ్చని వైద్యుడు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మాఫియా డాన్ చోటా రాజన్‌ను త్వరలోనే భారత్‌కి తీసుకురానున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న చోటా రాజన్‌ను గత నెలలో ఇండోనేషియాలోని బాలిలో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చోటా రాజన్‌ను భారత్‌కు తీసుకురావాలని అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ నుంచి ఇండోనేషియాకు వెళ్లిన సీబీఐ, ముంబై, ఢిల్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న చోటారాజన్‌ను ముందుగా ఢిల్లీకి తీసుకురానున్నారని, ఆ తర్వాతే ముంబైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఆర్ధర్ రోడ్డులో ఉన్న జైలుకు భద్రత పెంచారు. అయితే చోటారాజన్‌ను మంగళవారమే భారత్‌కు తరలించాల్సి ఉన్నా, బాలీ సమీపంలో ఓ అగ్నిపర్వతం పేలడంతో అక్కడి అధికారులు విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో మాఫియా డాన్ చోటా రాజన్ తరలింపు వాయిదా పడింది.