చౌకబియ్యం అక్రమార్కులపై ఉక్కుపాదం
కరీంనగర్,ఫిబ్రవరి7(జనంసాక్షి): ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న
బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టింది. రేషన్ డీలర్లు సైతం కార్డుదారుల నుంచి ఎక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి అంతకంటే ఎక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముతున్నారు. ఎంఎల్‌ఎస్
పాయింట్ల ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు లారీల ద్వారా రేషన్ బియ్యం, ఇతర వస్తువులు సరఫరా చేస్తారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి బియ్యం సరఫరా చేసే వాహనాల్లో జీపీఎస్ పరికరాలను అమర్చారు. ఫలితంగా రేషన్ వస్తువులు సక్రమంగా దుకాణాలకు చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు రేషన్ దుకాణాల డీలర్లు లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేస్తారు. ఈ బియ్యం తీసుకుంటున్న కొంతమంది వినియోగిస్తుండగా, మరికొందరు అధిక ధరలకు అమ్ము కుంటున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సైతం రేషన్ దుకాణాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని కిరాణ దుకాణా ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసిన దుకాణాదారులపై కేసులు నమోదు చేస్తున్నాయి. విశ్రాంత అధికారులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. బియ్యం పక్కదారి పడుతుండడంతో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. వీరు క్రమంగా చౌకధరల దుకాణాలను తనిఖీ చేస్తూ సరుకుల పంపిణీని, స్టాక్ నిల్వలను, రేషన్ బియ్యం రీసైక్లింగ్ కాకుండా, మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలు వివరాలను సేకరిస్తారు. పంటల అక్రమ నిల్వలను సైతం పరిశీలిస్తారు. అక్రమ రవాణా కాకుండా చర్యలు తీసుకుంటారు. దీంతో ప్రజా పంపిణీ దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులు పక్కదారి పట్టే అవకాశాలు ఉండవు. జిల్లా నుంచి రేషన్ బియ్యం మహారాష్ట్ర ఇతర ప్రాంతాలకు సైతం అక్రమంగా రవాణా అవుతోంది. గిరిజన ప్రాంతాల్లో దుకాణదారులు బియ్యాన్ని తీసుకొని బదులుగా ఇతర నిత్యావసర వస్తువులను ఇస్తున్నారు. చౌకధరల దుకాణాలను తనిఖీ చేస్తూ సరుకుల పంపిణీని, స్టాక్ నిల్వలను పరిశీలిస్తారు. బియ్యం, ఇతర వస్తువులు అక్రమ రవాణా కాకుండా చర్యలు తీసుకుంటారు. రేషన్ దుకాణంలో పంపిణీ చేసిన బియ్యం రీసైక్లింగ్ అయి సన్నబియ్యం రూపంలో పాఠశాలలు, వసతిగృహాలకు మరలకుండా చర్యలు తీసుకుంటారు. పౌరసరఫరాలశాఖకు మిల్లర్లు సన్నబియ్యాన్ని సరఫరా చేస్తుండగా, వారు రైతుల వద్ద కొనుగోలు చేసిన బియ్యం వివరాలను సైతం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సేకరిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసే ఇతర వస్తువులు దుకాణాలకు చేరకుండా నిఘా ఉంచుతారు. పంటల అక్రమ నిల్వలపై సైతం వీరు గుర్తిస్తారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటారు.