ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో 1291 మంది పోటీ

రెండు దశల్లో ఎన్నికలు

రాయ్‌పూర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1291 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ¬రా¬రీ పోటీ ఉండనుంది. చిన్న పార్టీలు కూడా తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈసారి మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ), మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి పార్టీ జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌, సీపీఐలు పొత్తు పెట్టుకోవడంతో రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌లకు ఈ కూటమి నుంచి పోటీ ఎదురు కానుంది.

రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది. మొదటి దశలో నవంబరు 12న 18 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుండగా, నవంబరు 20న రెండో దశలో మిగతా 72స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొలి దశ పోలింగ్‌లో 190 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో దశలో 1101మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారంతో ముగిసింది. అనంతరం నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు రెండో దశ పోలింగ్‌లో 1101 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.

రెండో దశలో పోలింగ్‌ కోసం 2,655మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా పరిశీలన అనంతరం 1249 మంది అభ్యర్థుల నామినేషన్లు పోటీ చేసేందుకు అర్హత పొందినట్లు అధికారులు తెలిపారు. వారిలో 148 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు.