ఛత్తీస్‌ఘడ్‌లో మొదలైన తొలిదశ పోలింగ్‌

మావోల బహిష్కరణ పిలుపుతో భారీ భద్రత

దంతెవాడలో ఓటేసిన అంధుడు

రాయ్‌పూర్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ మొదలయ్యింది. 90స్థానాలున్న అసెంబ్లీలో 18 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. వీటిలో ఎక్కువగా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలే ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ నిఘా నీడలో కొనసాగుతోంది. ఉదయం పది గంటల సమయానికి 14శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ అధికారులు వెల్లడించారు. గత ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడని భేజ్జి, గోర్ఖా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు పోలయ్యాయి. భేజ్జిలోని మరో పోలింగ్‌ కేంద్రంలో గతంలో ఒక్క ఓటు నమోదు కాగా, ఈసారి ఇప్పటికే 72 మంది ఓట్లు వెయ్యడం గమనార్హం. భేజ్జిలో 2017లో జరిగి మావోయిస్టుల దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అవాంతరాలను అధిగమించి అధికారులు పోలింగ్‌ పక్రియను కొనసాగిస్తున్నారు. సంగ్వారిలో కమలా కాలేజీలో ఏర్పాటు చేసిన పింక్‌ పోలింగ్‌ బూత్‌లో ఇవిఎంలు మొరాయించాయి. దీంతో ఈవీఎంల మరమ్మత్తుల అనంతరం పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక కోంటా సవిూపంలో మావోయిస్టులు అమర్చిన మూడు ఎల్‌ఈడీలను గుర్తించిన పోలీసులు వాటిని నిర్వీర్యం చేసి.. చెట్ల కింద పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. తొలివిడత ఎన్నికల్లో దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దంతెవాడలోని గీదమ్‌లో ఒక అంధుడు తన ఓటు హక్కు వినియోగించు కున్నాడు. అంధత్వానికి గురైన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటు వేశాడు. మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దంతెవాడ జిల్లాలో మందుపాతరను పేల్చారు. ఆదివారం కాంకేర్‌ జిల్లాలో బాంబు దాడి జరిగింది. ఓ ఎస్సై మృత్యువాత పడ్డారు. కాంకేర్‌, బీజాపూర్‌ జిల్లాల్లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద వేచి చూస్తున్నారు. బందా అనే గ్రామంలో పోలింగ్‌ కేంద్రం సవిూపంలో మూడు ఐఈడీ బాంబులు గుర్తించారు. సీఆర్‌పీఎఫ్‌ బాంబు నిర్వీర్యదళం వచ్చి వాటిని నిర్వీర్యం చేస్తుండడంతో పోలింగ్‌ కేంద్రాన్ని ఓ చెట్టు కిందకు మార్చి అక్కడ పోలింగ్‌ కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్‌కు భారీ షాక్‌

ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ గనారామ్‌ సాహూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. తొలి దశ ఎన్నికల ముందు సాహూ పార్టీని వీడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ ఎంతో కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల ముందు పార్టీ ముఖ్య నేత రాజీనామా చేయడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. రాజీనామాకు సరైన కారణమేవిూ తెలపకపోయినా.. ఆయన కోరుకున్న దుర్గ్‌ సిటీ సీటు విషయంలో పార్టీ ఆయనకు మద్దతుగా నిలవలేదన్న? నిరాశతో రాజీనామా చేశారని పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా తుది దశ పోలింగ్‌లో భాగంగా సోమవారం 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వాటిలో కాంగ్రెస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలు 12. గత పదిహేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి ఎలానైనా అధికారం చేజికిచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. నాలుగోసారి కూడా తమదే విజయమని సీఎం రమణ్‌సింగ్‌ ధీమాతో ఉన్నారు.