ఛత్తీస్‌ఘడ్‌లో శాంతిభద్రతలపై సిఎం సవిూక్ష

 

మావోల దాడుల నేపథ్యంలో భద్రతా చర్యలపై ఆరా

రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ సవిూక్షించారు. మావోయిల దాడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ఉన్నతాధికారులతో రమణ్‌సింగ్‌ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్స్‌ డీజీతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నిన్న జరిగిన ఘటన విచారకరమన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు వచ్చే విూడియా ప్రతినిధులు, స్థానికులకు రక్షణ కల్పించే విషయంపై రోడ్‌ మ్యాప్‌ తయారు చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిన్న దంతెవాడ జిల్లాలోని అర్నాపూర్‌ ప్రాంతం నిలావాయా గ్రామ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దూరదర్శన్‌ కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ సాహు, ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి మరో ఇద్దరు దూరదర్శన్‌ కెమెరామెన్స్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌కు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ నవంబర్‌ 12, రెండో దశ ఎన్నికలు నవంబర్‌ 20న నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సుక్మా, దంతెవాడ జిల్లాల్లో తొలిదశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో రమణ్‌సింగ్‌ ఇవాళ సవిూక్షించారు.