ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్
` ఆరుగురు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్,డిసెంబరు 27(జనంసాక్షి): ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గడ్ సరిహద్దు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం చిన్న చెన్నా పురం సవిూపంలోని సుక్మా, బీజాపుర్ జిల్లాల అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహోండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఏరియాలో మావోయిస్టుల పలు విధ్వంసాలకు పాల్పడడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టులపై పై చేయి సాధించేందుకు భారీ ఎత్తున కూంబింగ్ లు కొనసాగిస్తున్నారు. గత వారం రోజుల క్రితం చెన్నాపురం ఏరియాలో మావోయిస్టులు మందు పాతర పెట్టిన ఘటనలో ఒక ఆర్‌ఎస్ ఐ, జవాన్ గాయపడ్డారు. అదే విధంగా రెండు రోజుల క్రితం వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ ను కిడ్నాప్ చేసి మావోయిస్టులు హత్య చేశారు. దీంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత పై ముమ్మర గాలింపు చర్యలను చేపట్టారు. ఈ నేపధ్యంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని కిష్టారం, సుక్మా జిల్లాల మద్య మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పుల ఘటన లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.