ఛైల్డ్‌హోమ్‌ నిర్వాహకుడి అరెస్టు


దిల్లీ: బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన చైల్డ్‌హోమ్‌ నిర్వహకుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఏ అండ లేని అనాథ పిల్లలు, లేబర్‌ రాకెట్లు, అక్రమ రవాణాల నుంచి రక్షించిన, యాచకవృత్తిలో ఉన్న చిన్నారులకు ఆశ్రయంగా నడిపే ఈ ప్రభుత్వ చైల్డ్‌హోమ్‌లో వారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత కల్గిన వ్యక్తే వారి జీవితాలకు పెనుశాపంగా మారాడు. ఆ చిన్నారులపట్ల అసభ్యంగా ప్రవరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

చైల్డ్‌హోం నిర్వాహకుడు ఆర్‌.ఎస్‌. మీనా తమను లైంగికంగా వేధిస్తూ, వీడియోలు తీస్తున్నాడని ఆరుగురు చిన్నారులు ఫిర్యాదు చేయడంతో అతడ్ని పోలీసులు అరెస్టుచేశారు. బాధితులంతా పదేళ్లలోపు చిన్నారులే. అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు మొబైల్‌ ఫోన్‌లో అభ్యంతకర వీడియోలు, సెల్ఫీలు తీశాడని వెల్లడించారు. బాధిత చిన్నారుల నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు సీనియర్‌ పోలీస్‌ సతీశ్‌ కైన్‌ తెలిపారు. వైద్య పరీక్షల్లోనూ వారిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.

సంరక్షణ గృహంలో 50 మంది ఆరు నుంచి పదేళ్ల వయస్సున్న చిన్నారులే ఉన్నారు. దిల్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సందీప్‌ కుమార్‌ బాధిత చిన్నారులను కలిసి మాట్లాడారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.