జంతర్‌మంతర్ వద్ద.. తెలంగాణ ధూం తడాఖా
ప్రధాని ఇంటివైపు దూసుకెళ్లే యత్నం
పోలీసుల లాఠీ చార్జి వాటర్ క్యానెన్లతో ప్రయోగం
ఇంకెంత సమయం కావాలి తెలంగాణ ఇచ్చేయండి
అధికారంలోకి రాగానే తెలంగాణ : బాజాపా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 (జనంసాక్షి)
తెలంగాణ సమస్య పరిష్కారానికి అధికార కాంగ్రెస్‌కు ఇంకెంత సమయం కావాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే దశాబ్దాల కాలంగా తెలంగాణ అన్యాయానికి గురవుతోందని విమర్శించారు. ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ వెంటనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తాము బేషరతుగా మద్దతిస్తామని పునరుద్ఘాటించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఢిల్లీలో చేపట్టిన తెలంగాణ పోరుదీక్ష మంగళవారం రెండో రోజుకు చేరింది. దీక్షకు వెంకయ్యనాయుడతో పాటు ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ సమస్య పరిష్కారంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే సమస్య జఠిలమైందన్నారు. రెండు ప్రాంతాల ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ వైరుధ్యాలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ దాగుడుమూతలాడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ 2004 నుంచీ ప్రజలను మోసగిస్తోందని వెంకయ్య ధ్వజమెత్తారు. కమిటీలు, సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని, రోశయ్య కమిటీ అని, శ్రీకృష్ణ కమిటీ అంటూ కమిటీల ఏర్పాటు తప్ప కాంగ్రెస్ చేసిందేవిూ లేదన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు సెప్టెంబర్ 9 నాడు పార్లమెంట్‌లో ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత ఎందుకు వెనక్కు తగ్గిందని ఆయన ప్రశ్నించారు. చర్చలు, సంప్రదింపులు, సమావేశాలతో పొద్దు పుచ్చుతున్న కాంగ్రెస్ పార్టీకి.. సమస్య పరిష్కరించడానికి ఇంక ఎంత కాలం కావాలని మండిపడ్డారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని వెంకయ్య ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజల ఆకాంక్షలను గౌరవించే పార్టీ అయితే, ప్రజాస్వామ్యంపై నమ్మకుంటే వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. ఆ పార్టీ మనుగడ కొనసాగాలంటే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటయ్యే వరకూ బీజేపీ పోరాడుతుందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తమ పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని, అది సాకారమయ్యే వరకూ ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదన్నారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. గతంలో మూడు రాష్టాల్రు ఏర్పాటు చేసిన ఘతన తమదేనని, అలాగే, తెలంగాణను కూడా ఏర్టాటు చేస్తామని పునరుద్ఘాటించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు. తాము రాజకీయ లబ్ధి కోసం తెలంగాణకు మద్దతివ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే.. ఎలాంటి బేషజాలకు పోకుండా, రాజకీయ వైరుధ్యాలను పట్టించుకోకుండా.. బేషరతుగా మద్దతిస్తామని ప్రకటించారు. టీడీపీ వల్లే తాము అప్పట్లో తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేయలేకపోయామని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆ పార్టీ స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోక పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ తప్పించుకుంటుందన్నారు. తెలంగాణపై వెంటనే రాజకీయ ప్రక్రియ ఏర్పాటు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆత్మబలిదానాలకు కేంద్రవైఫల్యమే కారణమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ తొలినుంచీ మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే వరకూ బీజేపీ పోరాటం కొనసాగిస్తున్నందని స్పష్టం చేశారు. నాగం మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ వల్లే తెలంగాణ ఆలస్యమవుతోందన్నారు. యువత ఆత్మహత్యలకు ఆ పార్టీలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ఏకమై ఉద్యమిస్తేనే చిరకాల స్వప్నం సాకారమవుతుందన్నారు.
బీజేపీ కార్యకర్తలపై పోలీసుల ప్రతాపం
లాఠీలతో చితకబాదిన ఖాకీలు
హస్తినలో తెలం’గానం’ మార్మోగింది.. ఢిల్లీ వీధుల్లో ‘ప్రత్యేక’ వాదం మిన్నంటింది. తెలంగాణ ఏర్పాటు చేయాలని బీజేపీ చేపట్టిన తెలంగాణ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలంటూ మంగళవారం బీజేపీ తలపెట్టిన ప్రధాని నివాస ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ సాధన కోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన తెలంగాణ పోరుదీక్ష రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వేదిక వద్దకు చేరుకున్న కార్యకర్తలు ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించాలని నిర్ణయించారు. ఈ మేరకు జంతర్‌మంతర్ నుంచి ప్రధాని నివాసం వరకు తెలంగాణ మార్చ్ నిర్వహించాలని ర్యాలీగా బయల్దేరారు. అయితే వారిని పోలీసులు జంతర్‌మంతర్ వద్దే అడ్డుకున్నారు. వెంటబడి మరీ తరిమారు. దీంతో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జ్‌లో నిజామాబాద్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతో పాటు పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కార్యకర్తలకు ఢిల్లీ బిజెపి కార్యకర్తలు అండగా నిలిచారు. పోలీసుల వ్యవహార శైలిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తాము ప్రశాంతంగా మార్చ్ నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడమేమిటని సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. తామేవిూ ఉగ్రవాదులం కాదని, తమ కార్యకర్తలపై ఇలా విరుచుకుపడడమేమిటని మండిపడ్డారు. శాంతియుతంగా వెళ్తున్న వారిని రెచ్చగొట్టేలా పోలీసులు వ్యవహరించారని జగదేకర్ విమర్శించారు. ఢిల్లీ పోలీసుల తీరుపై పార్లమెంట్‌లో లేవనెత్తుతామని, ఉప రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెసు పట్టించుకోవడం లేదని, తాము ఈ రోజు తప్పకుండా ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని సాధారణ ప్రజలు అందరూ రాష్ట్రం రెండుగా విడిపోవాలని చూస్తున్నారని, కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని ఇంద్రసేనారెడ్డి అన్నారు. కాంగ్రెసు నాయకులే విభజనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితితో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసి ఉద్యమిస్తామన్నారు.