జకార్తాలో వరుస పేలుళ్లు

3
– 6 గురు మృతి

జకార్తా,జనవరి14(జనంసాక్షి): ఐఎస్‌ మరోమారు తెగబడింది.  ఇండోనేషియా రాజధాని జకార్తా బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. రాజధాని జకార్తాలో యూఎన్‌ కార్యాలయం వద్ద గురువారం ఉదయం బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఐరాస కార్యాలయం, సరినాహ్‌ షాపింగ్‌మాల్‌ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. వరుసగా ఆరు సార్లు పేలుళ్లు సంభవించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. 10నుంచి 15మంది దుండగులు ద్విచక్రవాహనాలపై వచ్చి ఈ  ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు. పోలీసులకు, దుండగులకు మధ్య కాల్పులు కొనసాగాయి. కొందరు దుండగులు థియేటర్‌ కాంప్లెక్స్‌లో దాక్కొని ఉన్నారని వారు చెప్పారు. అయితే.. వారు ఎవరినైనా బందీలుగా చేసుకున్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదని అధికారులు చెప్పారు. పాకిస్థాన్‌, టర్కిష్‌ రాయబార కార్యాలయాల వద్ద కూడా మూడుసార్లు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లు, కాల్పులతో ఆ ప్రాంతమంతా పొగమయంగా మారిందని.. స్థానికులు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులకు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు.   పేలుళ్ల అనంతరం రాజధానిలోని ప్రధాన ఏరియాలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఆరు బాంబులు పేల్చిన దుండగులు అంతటితో ఆగకుండా ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 10 నుంచి 14 మంది టెర్రరిస్తులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడి వెనక ఐఎస్‌ ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. గతేడాది ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ దాడి తరహాలోనే జకార్తాలోనూ దాడులు జరగడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. రాజధానిలో పలు ఏరియాలలో తనిఖీలు చేపట్టారు.