జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి

– రాజన్న రాజ్యం తీసుకొస్తాడు
– వివేకా హత్యకేసును ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తుంది
– పరిటాల హత్యకేసులో నా కొడుకుపై ఆరోపణలు వచ్చాయి
– అప్పుడు కొడుకని చూడకుండా వైఎస్‌ఆర్‌ సీబీఐ దర్యాప్తు చేయించారు
– విూరేందుకు మామరిది హత్యపై సీబీఐ దర్యాప్తు చేయనివ్వంటం లేదు
– చంద్రబాబు పాలన అవినీతి మయంగా మారింది
– అవినీతి మయ ప్రభుత్వాన్ని ఓటుతో తరిమికొట్టాలి
– వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ
ఒంగోలు, మార్చి29(జ‌నంసాక్షి) : తొమ్మిదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారంకై ప్రభుత్వంపై పోరాటం సాగించిన వై.ఎస్‌. జగన్‌కు ఈ ఎన్నికల్లో గెలిపించి.. తద్వారా రాజన్నరాజ్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మరో 13రోజుల్లో ఓటేయబోతున్నామని, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోవాలని అందరినీ కోరుతున్నానని అన్నారు. నేడు ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్దం జరుగుతోందని అన్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టంకట్టాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు. వైసీపీ ఆశయాల స్పూర్తితోనే వైఎస్సార్‌సీపీ పుట్టిందని విూ అందరికీ తెలుసని, వైఎస్సార్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్యన 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు.  వైఎస్‌ఆర్‌లా జగన్‌ కూడా నిత్యం ప్రజలతోనే ఉన్నారని, గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో అధికారానికి దూరమయ్యామన్నారు. ఈసారి అలాంటి పొరపాటుకు తావు లేకుండా చూసుకోవాలని విజయమ్మ సూచించారు. వైఎస్సార్‌ లేకపోవడం వల్ల మా కుటుంబానికి వచ్చిన నష్టం కంటే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఎక్కువ అనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం వైఎస్‌ఆర్‌, జగన్‌ మంచివాళ్లు అని, కాంగ్రెస్‌ నుంచి జగన్‌మోహన్‌ రెడ్డి బయటకు రాగానే.. అన్ని రకాల కేసులు, వేధింపులు మొదలయ్యాయని అన్నారు.  మా కుటుంబాన్ని చాలా బాధ పెట్టారని, వైఎస్‌ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను జగన్‌మోహన్‌ రెడ్డి ఓదార్చాలనుకున్నారని, జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకున్నారని విజయమ్మ గుర్తుచేశారు. వైఎస్సార్‌ బతికున్నంత కాలం ఏనాడు నేను బయటకు రాలేదని, ఆయన మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల నేను జనంలోకి రావాల్సి వచ్చిందన్నారు. నా బిడ్డ జగన్‌ను జైల్లో పెట్టారని, నాటి ఉపఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజల్లోకి
వచ్చానని, వైఎస్సార్‌ బతికున్నంత కాలం ప్రజలే ముఖ్యమనుకున్నారు. జగన్‌ కూడా ప్రజలే ముఖ్యమని జనంలో ఉన్నారన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో కుటుంబంతో గడిపింది చాలా తక్కువ అని, నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలననని, జగన్‌ ఏదైనా చెబితే అది చేస్తాడని, ఏదైనా అనుకుంటే అది సాధిస్తాడని విజయమ్మ అన్నారు. పరిటాల హత్యకేసులో నా కొడుకుపై ఆరోపణలు చేస్తే కొడుకని కూడా చూడకుండా వైఎస్సార్‌ సీబీఐ దర్యాప్తు చేయించారని విజయమ్మ గుర్తుచేశారు. మరి విూరేందుకు మా మరిది హత్యపై సీబీఐ దర్యాప్తు వేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబుపై బాంబు దాడి జరిగేతే వైఎస్‌ఆర్‌ అక్కడికెళ్లి ఆయనను ఓదార్చారని, దాడిని ఖండిస్తూ ధర్నా నిర్వహించారన్నారు. ఈరోజు మా మరిది హత్యకు గురైతే చంద్రబాబు పరవశించిపోతున్నారట.. ఎందుకు పరవశించపోతున్నారని అడుగుతున్నానని ప్రశ్నించారు. నవరత్నాలతో జగన్‌ ప్రజలను ఆదుకుంటారని, జగన్‌కు ఒక్క చాన్స్‌ ఇవ్వండని, రాజన్న రాజ్యం తీసుకువస్తాడని అన్నారు. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మహిదర్‌ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌ రెడ్డిల ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజయమ్మ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.