జగన్‌ను అడ్డుపెట్టుకొని..  ఏపీపై పెత్తనం చేయాలన్నేదే కేసీఆర్‌ కుట్ర

– ముగ్గురు కలిసి చంద్రబాబును ఓడించాలని చూస్తున్నారు
– బందరు పోర్టులో తెలంగాణ వారికి ఉద్యోగాలిప్పించాలని చూస్తున్నారు
– పలాస ప్రచార సభలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌
శ్రీకాకుళం, మార్చి26(జ‌నంసాక్షి) : ప్రస్తుతం ఏపీలో ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ల కొత్త జోడీ కనిపిస్తోందని,  ముగ్గురు కలిసి సీఎం చంద్రబాబును ఓడించాలని చూస్తున్నారని ఏపీ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్‌ ఆరోపించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో లోకేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ వైసీపీకి రూ.1000కోట్లు పంపిచారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రచార రథాలకు రంగులు మార్చారే కానీ సీటు కవర్లు మార్చలేదని ఎద్దేవా చేశారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని టీడీపీ అభ్యర్ధులను ఫోన్‌ చేసి కేటీఆర్‌ బెదిరిస్తున్నారని, ఏపీలో బలహీన ప్రభుత్వం ఉండాలన్నది కేసీఆర్‌ ఉద్దేశమన్నారు. అందుకే జగన్‌ను అధికారంలోకి తెచ్చి పెత్తనం చేయాలనుకుంటున్నారని లోకేష్‌ విమర్శించారు. బందరు పోర్టును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టేకోవర్‌ చేయాలని చూస్తోందని, బందరు పోర్టులో తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇప్పించాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని లోకేష్‌ అన్నారు. మోడీ స్విచ్‌ వేస్తేనే ఏపీలో జగన్‌ ఫ్యాన్‌ తిరుగుతుంది.. కేసీఆర్‌ రెగ్యులర్‌ తిప్పితే ఫ్యాన్‌ స్పీడ్‌ పెరుగుతుందన్నారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు. వైసీపీ కార్యకర్తలకు సిగ్గుంటే.. ఎందుకు కేటీఆర్‌ తో కలిసి ఉంటున్నారో జగన్‌ ను నిలదీయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ ఆంధ్రులను రాక్షసులన్నారని, తరిమితరిమి
కొట్టాలన్నారని, అయినా కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని జగన్‌ అంటున్నారని, ఇలాంటి దొంగలను తిప్పితిప్పి తరిమికొట్టాలని, పౌరుషంతో పోరాడాలని లోకేష్‌ పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీని చూస్తే జాలేస్తోందని లోకేష్‌  అన్నారు. 16నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి ఏపీ తాళాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నాకో అవకాశం ఇవ్వండని జగన్‌ అడుతున్నాడు.. ఇదేమన్నా గోళీలాటా? అని లోకేష్‌ ప్రశ్నించారు. మరోసారి మమ్మల్ని గెలిపించండి.. అధికారంలోకి రాగానే రూ.3వేలు పింఛన్లు ఇస్తామని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిని గెలిపిస్తారో.. లేక మాయమాటలు చెప్పేవారిని గెలిపిస్తారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పలాస టీడీపీ అభ్యర్ధిగా గౌతు శిరీషను  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లోకేష్‌ పిలుపునిచ్చారు.