జగన్‌పై దాడిని..  రాజకీయాలతో ముడిపెట్టొద్దు


– నిందితుడు వైసీపీ అభిమానిగా కుటుంబ సభ్యులే చెబుతున్నారు
– జగన్‌ డ్రామాలకు తెరదించి.. విచారణకు సహకరించాలి
– రాజకీయ డ్రామాలతో రాష్ట్రాభివృద్ధి అడ్డుకోవడం సరికాదు
– తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడిని రాజకీయాలతో ముడిపెట్టవద్దని టీడీపీ ఎంసీ కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడతూ విశాఖలో దాడి జరిగితే హైదరాబాద్‌ వెళ్లాక జగన్‌ డ్రామాలు మొదలుపెట్టారని అన్నారు. జగన్‌కి చట్టం అంటే గౌరవం లేదని అన్నారు. నిదితుడు వైసీపీ కార్యకర్త అని, జగన్‌ అభిమాని అని నిందితుడి కుటుంబసభ్యులే చెబుతున్నారని కనకమేడల గుర్తుచేశారు. నిందితుడి కుటుంబ సభ్యులే స్పష్టత ఇస్తున్నా వైసీపీ కావాలని దురుద్దేశంతో తెదేపాపై నిందలు మోపుతుందన్నారు. దాడి జరిగింది కేంద్ర పరిధిలోని ఎయిర్‌పోర్టులో అని, జగన్‌కు అయింది చిన్న గాయమేఅని వైద్యులుసైతం చెప్పారని అయినా వైకాపా నేతలు రాజకీయ లబ్ధికోసం, ప్రజల్లో సానుభూతికోసం తెదేపాను నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలతో ప్రజలను నమ్మించే కుట్రలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కనకమేడల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, నిందితుడిపై 307 కేసు పెట్టి విచారణ చేపడుతోందని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ జరిగితే వాళ్ల కుట్రేనని బయటపడుతుందనే వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి థర్డ్‌ పార్టీ ఎన్‌క్వయిరీ కోరుతున్నారని ఆరోపించారు. జగన్‌.. డ్రామాలకు తెరదించి విచారణకు సహకరించాలని కోరారు. కిడారి హత్య, తిత్లీ తుఫాన్‌ శాంతి భద్రతలు సంబంధించినవి కావా…? జగన్‌ పై జరిగిన దాడి ఘటన మాత్రమే శాంతి భద్రతలకు సంబంధించినదా అని కనకమేడల ప్రశ్నించారు.