జగన్‌పై హత్యాయత్నం .. చిన్నదిగా చూపే ప్రయత్నం


– జగన్‌కు కేంద్రం సెక్యూరిటీ కల్పించాలి
– ఆపరేషన్‌ గరుడ వెనుక ఎవరున్నారో విచారణ చేయాలి
– తిత్లీ బాధితులను కేంద్రం ఆదుకోవాలి
– రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి విన్నవించిన వైఎస్సార్‌ సీపీ నేతల బృందం
– మేం రాష్ట్రపతి పాలన కోరటం లేదు
– కేవలం న్యాయమైన దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని కోరుతున్నాం
– వెల్లడించిన వైసీపీ నేతలు
న్యూఢిల్లీ, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : ఇటీవల విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని చిన్నదిగా చూపేందుకు తెదేపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దాడిజరిగితే ఎలా జరిగిందో విచారణ చేయాల్సింది పోయి వైసీపీపై మాటలదాడికి పాల్పడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం కేంద్ర  మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను వైఎస్సార్‌ సీపీ నేతల బృందం
కలిసింది. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినపత్రాన్ని ఆయనకు అందించారు. అంతేకాకుండా తిత్లీ తుఫాను బాధితులకు కూడా సహాయం అందించాలని కోరారు. ఆ బృందంలో వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్త సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, వరప్రసాద్‌ ఉన్నారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై రాజ్‌నాథ్‌కు వివరించామని, ఘటనపై సీఎం స్పందించిన తీరుపై కూడా వివరించామన్నారు. చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలను రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ కేసు కేంద్ర పరిధిలో ఉందని చంద్రబాబు చెప్పడంతో.. కేంద్రం ఏం చేయగలదో అది చేస్తామని రాజ్‌నాథ్‌ హావిూ ఇచ్చారన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డికి రక్షణ కల్పించటంలో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. జగన్‌కు కేంద్రం సెక్యూరిటీ కల్పించాలని రాజ్‌నాథ్‌ను కోరామన్నారు. ఆపరేషన్‌ గరుడ వెనుక ఎవరున్నారో దానిపై కూడావిచారణ చేయాలని కోరినట్లు తెలిపారు. చంద్రబాబు జీవితమంతా నేరచరిత్రేనని ఆరోపించారు. నిందితుడిని వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుడిగా చూపించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. డీజీపీ కూడా అదేరకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని, ఏపీ పోలీసులు మినహా ఏదర్యాప్తు సంస్థ విచారణ చేసినా న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు గత చరిత్రపైనా రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశామని, ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని కూడా రాజ్‌నాథ్‌కు వివరించామన్నారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం రాష్ట్రపతి పాలన కోరటం లేదని, కేవలం న్యాయమైన దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని కోరుతున్నామని అన్నారు. ఏపీ పోలీసుల విచారణపై సందేహాలున్నాయని,  హత్యాయత్నంపై కేంద్ర సమగ్ర విచారణ జరపాలని, ఏపీలో ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేదన్నారు.
మంత్రుల మాట తీరు రౌడీల్లా ఉందని, బాధ్యతారాహితంగా మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ తీరును ఏపీ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. తమ వినతులు విన్న రాజ్‌నాధ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారని వైసీపీ నేతలు అన్నారు.