జగన్‌ వస్తే ఏపీని శ్మశానంగా మారుస్తాడు

– జగన్‌ ఏనాడైనా బీసీల సమస్యలపై స్పందించారా?
– ఎన్నికల సమయంలో బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు
– టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
విజయవాడ, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : ఏపీ అన్ని రంగాల్లో మరింత వేగవంతంగా అభివృద్ధి చెందాలంటే మరోసారి చంద్రబాబు సీఎం అయితేనే సాధ్యమవుతుందని, అలా కాకుండా జగన్‌ అధికారంలోకి వస్తే ఏపీని శ్మశానంగా మారుస్తారని టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. జగన్‌పై 420 పేరుతో బయోపిక్‌ తీస్తే విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు.  బీసీ గర్జన పేరుతో జగన్‌ నోటికొచ్చినట్లు హావిూలు గుప్పించారని విమర్శించారు. జగన్‌ ఇచ్చిన హావిూలను చంద్రబాబు ఇప్పటికే అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వస్తే సంక్షేమం…జగన్‌ వస్తే ఏపీ శ్మశానమవుతుందని ఆయన అన్నారు. పక్క రాష్ట్ర నేతలతో జగన్‌ చేతులు కలిపి.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలోనే బీసీల అభివృద్ధి అని స్పష్టం చేశారు. కులాలవారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థికంగా చేయూత అందిస్తున్నామన్నారు. జగన్‌ ఏనాడైనా బీసీల సమస్యలపై స్పందించారా అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయని బీసీలపై జగన్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. జగన్‌పై ఉన్న కేసులకు అసలు పోటీ చేసే అర్హత లేదని… ఇతర దేశాల్లో అయితే ఈపాటికి ఊచలు లెక్కిస్తూ ఉండేవారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. జగన్‌ ప్రకటించింది బీసీ డిక్లరేషన్‌ కాదని…బీసీల గొంతు కోసే డిక్లరేషన్‌ అని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలోనే బీసీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించామన్నారు. టీటీడీ ఛైర్మన్‌ పదవి బీసీలకు ఇచ్చామని, బీసీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం రూ. 33వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. వైఎస్‌ హయాంలో ఆదరణ పథకాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. బీసీలకు రూ. 3వేల కోట్లు కేటాయించి ఖర్చు కూడా చేయలేదన్నారు. ఆర్‌. కృష్ణయ్య ఏపీకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని మండిపడ్డారు. టీడీపీలో 31మంది బీసీ ఎమ్మెల్యేలు, 8మంది మంత్రులు ఉన్నారని తెలిపారు. 50 శాతం బీసీలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.